న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నగర పేద ప్రజానీకానికి కూడా నరేగా (ఉపాధి హామీ చట్టం) అవసరమని టీఆర్ఎస్ చేవేళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఆయన శుక్రవారం లోక్‌సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగానే పట్టణాల్లో కూడా ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని రూపొందించాలని సూచన చేశారు. పట్టణీకరణ రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నందున పట్టణాల్లో కూడా ఉపాధి హామీ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా వెంటనే కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. సాధారణంగా ఉపాధి, మెరుగైన జీవనవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణాలకు చేరుతుండడం వల్ల పట్టణాల్లోని మౌలిక వసతుల మీద ప్రత్యేక దృష్టి అవసరమని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 31 శాతం జనాభా పట్టణాల్లో నివాసం ఉంటోందని నొక్కి చెప్పారు.
2030 నాటికి దేశంలోని 40 శాతానికి పైగా జనాభా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండబోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఇది 50 శాతాన్ని దాటే అవకాశం ఉందని ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ తరుణంలో పట్టణ పేదరికంపై దేశంలోని అన్ని ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. పట్టణ పేదలకు అవసరమైన గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం ,విద్య, సామాజిక భద్రత ,జీవనోపాధి వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని రంజిత్ రెడ్డి తేల్చి చెప్పారు. ముఖ్యంగా పట్టణంలోని పేదలకు వివిధ అంశాల్లో సరైన అవకాశాలు కల్పించినప్పుడే వారు నాణ్యమైన జీవితాన్ని పొందే అవకాశం ఉంటుందని సభకు వివరించారు. నగరాల్లోనూ నరేగాను అమలు చేయడం వల్ల పట్టణ పేదలకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం సవరణకు బిల్లు
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల్లో ఇంకా పెండింగ్‌లో ఉన్నవాటిని బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని రంజిత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన హామీల మేరకు తెలంగాణలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు విస్మరించినందున ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణకు ప్రతిపాదన చేసినట్టు పేర్కొన్నారు. దీంతో తమ డిమాండ్ల గురించి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవచ్చని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ, రాజ్యాసభ వేదికగా తాము ఎన్నిసార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం భూమి అందించడానికి ముందుకొచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని రంజిత్ రెడ్డి మండిపడ్డారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగడం లేదని వాపోయారు. విభజన చట్టం అమలైనప్పటి నుంచి పదేళ్లలోపు హామీలు అమలు చేయాల్సి ఉందని, ఇప్పటికే చట్టం అమల్లోకి వచ్చి ఎనిమిదేళ్లైనా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి హామీల అమల్లో కేంద్రం చురుగ్గా వ్యవహరించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్పందించేవరకు పోరాడతామని రంజిత్‌రెడ్డి స్పష్టం చేశారు.