పలువురికి తమకి చేతనయిన సాయాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నారు సినీ సెలబ్రిటీలు. కాగా యూకేలో ఉన్నత విద్యని పూర్తి చేసేందుకు ఓ అమ్మాయికి సాయం చేశారు సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్. ఈ విషయాన్ని దర్శకుడు నవీన్ మహ్మదాలీ ట్వీట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. శ్రీ చందన అనే అమ్మాయి చదువుల సరస్వతి. ఆమెకు బ్రిటన్ లో మాస్టర్స్ చదివే అవకాశం వచ్చింది. అదే సమయంలో తండ్రి మరణించారు. దీంతో ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టి యూకే యూనివర్సిటీవారి సీటును వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ప్రకాష్ రాజ్‌కు తెలిసింది. ఆయన వెంటనే స్పందించి ఆమె చదువుకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
శ్రీచందన ఇటీవలే యూకేలో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆమె చదువుకైన ఖర్చునంతా ఆయనే భరించారు. ఇప్పుడు బ్రిటన్ లో ఉద్యోగం పొందడానికి కూడా డబ్బు అవసరం పడింది శ్రీచందనకి. ఆ బాధ్యతను కూడా తానే తీసుకున్నారు ప్రకాష్. ఆమె ఉద్యోగానికి కూడా కట్టాల్సిన మొత్తాన్ని ఆమెకు అందించారు. ఈ విషయాన్ని నవీన్ మహ్మదాలీ ట్విట్టర్ లో పోస్టు చేశారు. పేద యువతి జీవితంలో వెలుగులు నింపినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. నవీన్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ప్రకాష్ రాజ్ స్పందించారు. ‘ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. అనేక చేతులు కలిసినప్పుడు ఇలాంటివి సాధ్యమవుతాయి… ద జోయ్ ఆఫ్ ఎంపవరింగ్’ అంటూ ట్వీట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..