బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండేకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పోర్న్ చిత్రాల రాకెట్ కేసులో అరెస్ట్ నుంచి ఆమెకు తాత్కాలిక ఉపశమనం దొరికింది. ఈ కేసులో ప్రధాన నిందితుడయిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా సైతం అరెస్ట్ నుంచి రక్షణ పొందాడు. కాగా తనకు సైతం అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని పూనమ్ పాండే బాంబే హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ మేరకు ఆ పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర సర్కారుకు తాజాగా నోటీసులు జారీ చేసింది. కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పిటిషనర్ (పాండే)కు వ్యతిరేకంగా ఎటువంటి బలవంతపు చర్యలకు దిగొద్దని సర్కారును ఆదేశించింది. లైంగికంగా అసభ్యకరమైన వీడియోలను పంపిణీ చేస్తున్నారంటూ వివిధ సెక్షన్ల కింద ముంబై సైబర్ సెల్ పోలీసులు రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కేసులో షెర్లిన్ చోప్రాతో పాటు పూనమ్ పాండే పేరును కూడా పోలీసులు చేర్చిన విషయం విదితమే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..