స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణమవుతోంది పొన్నియిన్ సెల్వన్ చిత్రం.
ఈ ఏడాది సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది పొన్నియిన్ సెల్వన్ చిత్రం. కల్కి కృష్ణమూర్తి రచించిన 1955 నాటి నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా తయారవుతున్న ఈ సినిమా మాస్టర్‌పీస్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ నవల ప్రచురితమైన తర్వాత నుంచీ అనేకమంది దర్శకులు దాన్ని సినిమాగా తియ్యాలని కలలు కన్నారు కానీ, సఫలీకృతులు కాలేకపోయారు. ఇప్పుడు మణిరత్నం తన కలను నిజం చేసుకుంటున్నారు.
10వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యం కోసం ఆ రాజవంశీకుల మధ్య జరిగే ఘర్షణల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ మూవీని నిర్మించేందుకు లైకా ప్రొడక్షన్స్ ముందుకు రావడంతో షూటింగ్ స్టార్ట్ చేశారు మణిరత్నం. ఈ సినిమా నిర్మాణంలో ఆయన సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ కూడా పాలు పంచుకుంటోంది. ఎలంగో కుమారవేల్‌తో కలిసి ఈ మూవీకి స్క్రిప్టు సమకూర్చారు మణిరత్నం. టైటిల్ రోల్ పొన్నియిన్ సెల్వన్‌గా పిలవబడే రాజరాజ చోళునిగా జయం రవి, అతని అన్న ఆదిత్య కరికాలన్‌గా విక్రమ్, వల్లవరాయన్‌గా కార్తీ, రాణి నందినిగా ఐశ్వర్యా రాయ్ నటిస్తుండగా, త్రిష, శోభిత ధూళిపాళ, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు, శరత్‌కుమార్, పార్తీపన్, ప్రభు, ప్రకాశ్‌రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రధారులు. ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ ఎపిక్ మూవీకి రవి వర్మన్ సినిమాటోగ్రాఫర్‌గా, ఎ. శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.