లైకా ప్రొడక్షన్స్ లో నిర్మించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్2.ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ ఏంటంటే.. ఈ కథ నందిని (ఐశ్వర్య రాయ్) .. చోళ యువరాజు ఆదిత్య కరికాలన్ (విక్రమ్) టీనేజ్ లవ్ స్టోరీతో మొదలవుతుంది. అయితే ఆదిత్య కరికాలన్ కుటుంబ సభ్యులు, అతనికి తెలియకుండా ఆమెను అంతఃపురం నుంచి గెంటేస్తారు. అలాంటి పరిస్థితుల్లో వీరపాండ్య మహారాజు ఆమెను చేరదీసి కూతురిలా చూస్తాడు. ఆమె కళ్ల ఎదుటనే అతనిని ఆదిత్య కరికాలుడు అంతం చేస్తాడు. తన కుమారుడైన అమరభుజంగుడికి సింహాసనం దక్కేలా చేయమని వీరపాండ్యుడు నందిని దగ్గర మాట తీసుకుని చనిపోతాడు. తండ్రిలాంటి ఆయనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం, చోళరాజ్యాన్ని .. ఆ రాజ్యానికి రక్షక కవచంలా ఉన్న తన మాజీ ప్రేమికుడు ఆదిత్య కరికాలుడిని అంతం చేయడానికి నందిని సిద్ధపడుతుంది. సముద్రంలో మునిగిపోయాడనుకున్న అరుళ్ మొళి ( జయం రవి), అతని సన్నిహితుడైన వల్లభ దేవన్ ( కార్తి) బ్రతికి బయటపడతారు. ఈ విషయం తెలిసి, అతని తండ్రి సుందర చోళుడు (ప్రకాశ్ రాజ్) అతని తోబొట్టువులైన ఆదిత్య కరికాలన్ .. కుందవై (త్రిష) సంతోష పడతారు. పాండ్య రాజులకు ఇచ్చిన మాట కోసం చోళ రాజ్యాన్ని దెబ్బతీయడనికి ఒక వైపున రవిదాసతో కలిసి నందిని ప్రయత్నిస్తూ ఉంటుంది. మరో వైపున చోళ సింహాసనం ధర్మం ప్రకారం తనకి దక్కాలని భావించిన ఆదిత్య కరికాలన్ పినతండ్రి మధురాంతకుడు (రెహ్మాన్) రాష్ట్ర కూటులతోను .. కాలాముఖులతోను చేతులు కలుపుతాడు. ఇలా రెండు వైపుల నుంచి చోళ రాజ్యాన్ని ప్రమాదం చుట్టుముడుతూ ఉంటుంది. మరి వీటన్నింటి నుంచి ఎలా బయటపడ్డారనేదే కథ.
విశ్లేషణ.. మణిరత్నం నుంచి వచ్చిన భారీ చారిత్రక చిత్రం ఇది. సినిమా టిక్ గా ఆయన ఈ కథను తయారు చేసుకున్న విధానం .. తెరపై దానిని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. అటు చోళ .. ఇటు పాండ్య రాజులకు సంబంధించిన కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రతి విషయంపై దృష్టిపెట్టడం .. ప్రతి పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేయడం అంత ఆషా మాషీ విషయమేం కాదు. ఇక ఆ కాలం నాటి సెట్టింగులు .. సామజిక వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేయడం అంత తేలిక కాదు. ఈ విషయంలో మణిరత్నం పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఇక ప్రతి సన్నివేశం విజువల్ పరంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కథ జరిగే కాలంలోకి మనలను తీసుకుని వెళుతుంది. లొకేషన్స్ ను ఎంచుకోవడంలోను .. లైటింగ్ విషయంలోను మణిరత్నానికి గల ప్రత్యేకతను గురించి అందరికీ తెలుసు. అదే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది. ఈ కథను ఆయన ఒక అందమైన టీనేజ్ లవ్ స్టోరీతో మొదలుపెట్టిన తీరు .. ఆ లవ్ స్టోరీని అలా నడిపిస్తూ వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. అసలు ఆయన ఫస్టు షాట్ తోనే ప్రేక్షకులను పడగొట్టేశారు.
నటీ నటుల నటన.. టీనేజ్ లవ్ స్టోరీ తరువాత నిదానంగా నడుస్తూ వచ్చిన కథ, ఇంటర్వెల్ కి ముందు ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు వచ్చే విక్రమ్ సీన్ .. ఐశ్వర్య రాయ్ సీన్ .. బౌద్ధ విహారంలో అరుళ్ మొళిని శత్రువులు చుట్టుముట్టే సీన్ హైలైట్ గా నిలుస్తాయి. సెకాండాఫ్ లో సుందర చోళుడిని మందాకిని కాపాడే సీన్ .. కడంబూర్ కోటలో తనని చంపడానికి నందిని ప్లాన్ చేసిందని తెలిసి కూడా ఆదిత్య కరికాలన్ అక్కడికి వెళ్లే సీన్ హైలైట్. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం విషయానికొస్తే బాణీల పరంగా అంతగా ఆకట్టుకునేవేమీ లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం గొప్పగా ఉంది. రవి వర్మన్ ఫొటోగ్రఫీ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా చెప్పుకోవలసిందే .. ఒప్పుకోవలసిందే. ఇది కొంచెం క్లిష్టమైన స్క్రీన్ ప్లే తో కూడినదే. అయినా ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ పనితీరు నీట్ గా అనిపిస్తుంది. తనికెళ్ల భరణి డైలాగ్స్ సందర్భానికి తగినట్టుగా ఉన్నాయి.
కథలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే.. కథ .. పాత్రలను మలచిన విధానం .. టేకింగ్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. ప్రత్యేకమైన సెట్స్ .. లొకేషన్స్ అనే చెప్పాలి.ఓవరాల్ గా ఈ చిత్రాన్ని చూడొచ్చనే టాక్ వినిపిస్తుంది.మరి జయపజయాలు ప్రేక్షకులు ఇచ్చే రివ్యూపై ఆధారపడి ఉంటుందన్న సంగతి తెలిసిందే.