హైదరాబాద్ ఆంధ్రప్రభ: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మొక్క జొన్న జన్యు వైవిద్య దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కత్తెర పురుగును తట్టుకునే హైబ్రిడ్స్‌ను రూపొందించడానికి ఏర్పాటు చేసిన పాలిహౌస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ ఉపకులపతి డా. వి.ప్రవీణ్‌రావు, మొక్కజొన్న కేంద్రం అధిపతి డా.సుజయ్ రక్షిత్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాల నుంచి పలువురు శాస్తవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ వర్శిటీ ఉపకులపతి డా. వి.ప్రవీణ్ రావు మాట్లాడుతూ మొక్క జొన్న పరిశోధనలో పురుగులు, తెగుళ్లు, అనుకూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే వంగడాలను రూపొందించాలని సూచించారు. రాబోయే రోజుల్లో యాంత్రీకరణకు అనువైన వంగడాలను తక్కువ నీరు, ఎరువులను ఉపయోగించి అధిక దిగుబడులు పొందే వంగడాలను రూపొందించాలని తెలిపారు.
ఇవేకాకుండా విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే వంగడాలను కొత్త గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. అనంతరం అంతర్జాతీయ మొక్కజొన్న కేంద్రం అధిపతి డా.సుజయ్ రక్షిత్ మాట్లాడుతూ వివిధ వాతావరణ పరిస్థితులలో తెగుళ్లను, పురుగులను తట్టుకొనే వంగడాలను రూపొందించాలని తెలిపారు. అలాగే 14 పరిశోధన కేంద్రాల నుంచి సేకరించిన 548 జన్యు వైవిధ్య రకాలను ప్రదర్శించడం జరిగిందన్నారు. వీటిలో నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు అనువైన ఇన్ బ్రిడ్స్‌ను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వింటర్ నర్సరీ కేంద్రం ప్రిన్సిపాల్, సైంటిస్టు జేసీ శేఖర్ మొక్కజొన్న పరిశోధన కేంద్రం ప్రిన్సిపాల్, సైంటిస్టు డా. ఎంవి నగేష్ కుమార్, దేశంలోని 32 పరిశోధన కేంద్రాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.