Friday, November 22, 2024

ఢిల్లీలో ‘పవార్’ పాలిటిక్స్.. మతలబ్ క్యా హై?

2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయేని ఎదుర్కోవడానికి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు సాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ను కలుసుకున్నారు. ఇప్పటికే రెండు సార్లు వీరి భేటీ జరగ్గా.. తాజాగా మూడోసారి సమావేశం అయ్యారు. దీంతో రాజకీయంగా వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, పవార్, పీకే మధ్య జరుగుతున్న చర్చలకు సంబంధించిన వివరాలు మాత్రం బయటకు వెల్లడి కావడం లేదు. దీంతో వీరి మధ్య ఏ అంశంపై చర్చలు జరుగుతున్నాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.


మొదట ఈ నెల 12న ముంబైలోని పవార్ నివాసంలో ఆయనను ప్రశాంత్ కిషోర్ కలిశారు. ఆ రోజున ఇద్దరి మధ్య సుమారు 3 గంటలకు పైగా చర్చలు జరిగాయి. తర్వాత సోమవారం(జూన్ 21) ఢిల్లీలో ప్రత్యేకంగా మరోసారి భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్, ఈ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ కూడా పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి మరిన్ని ప్రతిపక్ష పార్టీలు చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై శరద్ పవార్ చర్చలు జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


మరోవైపు శరద్ పవార్ సారథ్యంలో ఎనిమిది పార్టీల నేతలు మంగళవారం ఢిల్లీలోని పవార్ నివాసంలో సమావేశమయ్యారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి థర్డ్ ఫ్రంట్గా ఏకీకరణ చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement