హైదరాబాద్, ఆంధ్రప్రభ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచే బలమున్నా.. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం చిక్కకూడదనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎంపీటీసీలు, జడ్‌పీటీ సీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇప్పటికే బెంగళూరు క్యాంపునకు చేరుకోగా, మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో ఇది సాగుతోంది. మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కూడా క్యాంప్ పర్యవేక్షణ బాధ్యత అప్పగించినట్లు తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలు, కౌన్సిలర్లు మంగళవారం ఉదయానికి హైదరాబాద్ చేరుకోగా, వీరిని బెంగళూరు, గోవాకు తరలించారు. ఖమ్మం జిల్లాకు చెంది న ప్రజాప్రతినిధులను గోవా శిబిరానికి ప్రత్యేక బస్సుల్లో పంపగా, అక్కడి ఎమ్మెల్యేలు జెండాలు ఊపి.. ప్రజాప్రతినిధులను క్యాంపునకు పంపారు. ఖమ్మం జిల్లా క్యాంపు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పర్యవేక్షణలో జరుగుతోంది. పార్టీ అభ్యర్ధి తాతా మధు గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆ జిల్లా గెలుపు బాధ్యతలు అప్పగించారు. ఈ మూడు జిల్లాలపై టీఆర్‌ఎస్ నాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టి.. ఓటర్లు చేజారకుండా అప్రమత్తతతో వ్యవహరిస్తోంది.
కోర్కెలకు సమయం ఇదే..
ప్రజాప్రతినిధులను క్యాంపులకు పార్టీ నాయకత్వం తరలిస్తుండగా, ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు తమ డిమాండ్ల చిట్టా మంత్రులు, ఎమ్మెల్యేల ముందు పెడుతున్నట్లు తెలిసింది. కొందరు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేయగా, మరికొందరు.. తమకు రూ.50 వేలు, లక్ష ఇస్తే తీసుకోమని దళితబంధు తరహాలో రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ పెట్టినట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో అడ్వాన్సుగా రూ.50 వేలు ఇచ్చి క్యాంపులకు తీసుకెళ్ళినట్లు తెలిసింది. క్యాంపు రాజకీయాలతో ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి రూ.15 కోట్లకు పైనే ఖర్చవుతుందని నేతలు అంచనా వేస్తున్నారు. కరీం నగర్‌లో బలమైన ప్రత్యర్థి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఖర్చు ఎక్కువగానే ఉం టుందని అంచనా వేస్తున్నారు. ఒక్కో అభ్యర్థికి ఇక్కడ రూ.25 కోట్లకు పైనే ఖర్చు అయ్యే అవకాశముందని అంటున్నారు. భార్యలు ప్రజాప్రతినిధులుగా ఉన్న చోట భర్తలు పెడుతున్న డిమాండ్లు.. నేతలకు తలబొప్పి కట్టిస్తున్నాయి. క్యాంపులలో ఫోన్లను నిరాకరిస్తుండగా, వారిని జాగ్రత్తగా నేతలు కాపాడుకుంటున్నారు. డిసెంబర్ 10న పోలింగ్ జరగనుండగా, 10 ఉదయం కల్లా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా టూర్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..