జాతీయ స్థాయి పొలిటికల్ అలయెన్స్ దిశగా టీఆర్ ఎస్ పార్టీ మళ్లీ ప్రయత్నాలు స్పీడప్ చేసినట్టు స్పష్టమవుతోంది. అందుకని బీజేపీ వ్యతిరేక పార్టీలతో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ మధ్య డీఎంకే, సీపీఐ, సీపీఎం జాతీయ నాయకత్వంతో సమావేశమైన కేసీఆర్.. నిన్న బిహార్ విపక్ష నేత, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తోనూ భేటీ అయ్యారు.
జాతీయ రాజకీయాలను శాసించే దిశగా టీఆర్ ఎస్ మరోసారి బలమైన పునాది వేసుకుంటోంది. బీజేపీ దాని వ్యతిరేక పార్టీలతో కలిసి ముందుకెళ్లేందుకు కసరత్తు చేస్తోంది. ప్రగతి భవన్ వేదికగా వివిధ రాజకీయ పక్షాల నేతలతో గులాబీ బాస్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండడమే దీనికి నిదర్శనం. గత నెలలో తమిళనాడు వెళ్లిన కేసీఆర్, ఆ రాష్ట్ర సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్‌తో చర్చలు జరిపారు. ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కేరళ మంత్రి రాజన్… సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ తదితర సీనియర్ నేతలతో వేర్వేరుగా భేటీ ఆయ్యారు. కాగా, మంగళవారం బిహార్ విపక్ష నేత, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తోనూ సమావేశమయ్యారు. తేజస్వి తండ్రి, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తోనూ ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. అయితే.. కేసీఆర్ వంటి లీడర్ దేశానికి ఎంతో అవసరమని, ఒక విజన్, ముందుచూపున్న కేసీఆర్ తప్పకుండా జాతీయ రాజకీయాల్లోకి రావాలని లాలూప్రసాద్ యాదవ్ అన్నట్టు వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా పలు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతోనూ కేసీఆర్ ఫోన్లలో సంప్రదింపులు జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
బీజేపీయేతర కూటమి, లౌకిక, ప్రజాస్వామిక ప్రధాన ఉమ్మడి అంశాలను బేస్ చేసుకుని అలయెన్స్ ఏర్పాటు చేయడానికి తీవ్రంగా కసరత్తు జరుగుతోంది. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా ఉన్న పార్టీలను ఏకం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీయేతర కూటమి ప్రయత్నాల వేగం మరింత వేగంగా సాగుతోంది. బీజీపీ.. ముక్త్ భారత్ పేరిట లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని పలు చర్చల్లో నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, జాతీయ రాజకీయాల దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి నాలుగైదేళ్లుగా మాట్లాడుతూనే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 2019లో పలువురు నేతలను స్వయంగా కలిసి చర్చించారు. కర్నాటకలో జేడీఎస్ నేత దేవేగౌడ, తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్, ఒడిశాలో బిజూ పట్నాయక్.. జార్ఖండ్‌లో జేఎంఎం శిబు సోరెన్, యూపీలో సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్.. ఏపీలో వైసీపీ అధినేత జగన్, పశ్చిమబంగాల్‌లో టీఎంసీ మమత బెనర్జీ తదితరులతో చర్చలు కూడా జరిపారు. అయితే కేంద్రంలో బీజేపీ రెండోసారి తిరుగులేని ఆధిక్యంతో అధికారంలో రావడంతో ఆ ప్రయత్నాలకు అప్పట్లోనే బ్రేకులు పడ్డాయి..
అనుకున్నా సానుకూలం కాలే…
గతంలో సీఏఏ, ఎన్ఆర్‌సీ వివాదం తలెత్తినప్పుడు.. ఆ అంశం ఆధారంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో సమావేశం నిర్వహించేందుకు టీఆర్ఎస్ యోచించింది. హైదరాబాద్‌లోనే అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ కూడా హైదరాబాద్‌లో జాతీయ స్థాయి రాజకీయ, కార్మిక సదస్సు నిర్వహిస్తామన్నారు. అయితే కరోనా, తదితర కారణాల వల్ల అవన్నీ ముందుకు సాగలేదు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత దూకుడు పెంచి, బీజేపీని ఢీకొట్టడమే టార్గెట్‌గా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. దీనికి గతంలో లెక్క కాకుండా ఇప్పటి నుంచే ఎంతో వ్యూహాత్మకంగా.. ఆచితూచి వ్యవహరిస్తున్నారు కేసీఆర్. కేంద్రంలోని బీజేపీ పలు రాష్ట్రాల్లో తమకు గిట్టని రాజకీయ నేతలను ఎట్లా ఇబ్బందులకు గురిచేస్తుందో.. ఐటీ, సీబీఐ వంటి వాటిని ఉసిగొల్పి లొంగదీసుకుంటుందో అన్నీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. తెలంగాణతో పాటు.. జాతీయ స్థాయిలో బీజేపీ అరాచకాలకు అంతం పలకాలంటే రాజకీయ వ్యూహం లేకుండా సాధ్యం కాదన్న విషయం తెలుసుకున్న కేసీఆర్.. ఆ దిశగా బలమైన చర్యలకు సన్నద్ధమైనట్టు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే త్వరలో కూటమి ఏర్పాటు చేయాలని, అవసరమైతే 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలోనూ ప్రత్యక్షంగా దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.