Tuesday, November 26, 2024

తిరుమల తలనీలాల పై రాజకీయం!

గత కొద్ది నెలలుగా తిరుమల తిరుపతి దేవస్థానం తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తిరుమలలో అన్యమత ప్రచారం మొదలుకుని.. టీటీడీ వెబ్ సైట్లో తప్పిదాలు, శ్రీవారి భూముల వేలానికి టెండర్, ప్రసాదాల ధరల పెంపు, ఎన్నికల సందర్భంగా లడ్డూల పంపకం లాంటి అనేక అంశాలు వివాదానికి దారి తీశాయి. ఇప్పుడు మరోసారి టీటీడీ పెద్ద వివాదంలో చిక్కుకుంది. శ్రీవారికి భక్తులు ఎంతో భక్తితో, నమ్మకంతో సమర్పించే తలనీలాలు స్మగ్లింగ్కు గురవుతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. దీనిపై నేషనల్ మీడియాలో వార్తలు వస్తుండటం కలకలం రేపుతోంది.

మిజోరాంలో భారత సైన్యం భారీ ఎత్తున కేశాల రాశులతో వెళ్తున్న వాహనాలను పట్టుకుంది. ఈ వాహనాల్లో పెద్ద పెద్ద మూటల్లో కేశాలను పోగేసి 120 బ్యాగుల్లో తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి విలువ రూ.2 కోట్లని వెల్లడైంది. వీటిని చైనాకు అక్రమంగా ఎగుమతి చేసే క్రమంలో అసోం రైఫిల్స్, కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విచారణలో భాగంగా ఇవి తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన తలనీలాలని, టీటీడీ ఆస్తి అయిన వీటిని అక్రమంగా మయన్మార్ ద్వారా చైనాకు స్మగ్లింగ్ చేస్తున్నారని తేలింది.

మరోవైపు మయన్మార్ సరిహద్దుల్లో సైన్యానికి దొరికి తలనీనాలతో తమకెలాంటి సంబంధం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. పట్టుబడిన 120 బ్యాగుల తలనీలాలతో తమకు సంబంధం లేదని, ప్రతి 3 నెలలకోసారి ఈ-టెండర్ల ద్వారా తలనీలాలు విక్రయిస్తామని పేర్కొంది. కొనుగోలు చేసిన సంస్థ ఏ ప్రాంతానికి ఎగుమతి చేస్తుందనేది సంబంధం లేదని తెలిపింది. తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల పేర్లు అధికారికంగా తెలియజేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతామని టీటీడీ వెల్లడించింది.

ఇది ఇలా ఉంటే.. పోలీసులు సీజ్ చేసిన 120 బ్యాగుల తలనీలాలకు సంబంధించిన వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. తిరుపతి ఉప ఎన్నికల వేళ.. ప్రతిపక్ష పార్టీలకు మరో ఆయుధం దొరికినట్లు అయింది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్ష టీడీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘’మొన్నటి దాకా జగన్ రెడ్డి బ్యాచ్ శేషాచలం నుంచి ఎర్రచందనం చైనాకు స్మగ్లింగ్ చేసింది. ఇప్పుడు తలనీలాలు కూడా స్మగ్లింగ్ చేస్తోంది. అక్రమంగా మయన్మార్ సరిహద్దు దాటుతున్న 120 సంచుల తలనీలాలను 23 సెక్టార్ అస్సాం రైఫిల్ సిబ్బంది పట్టుకున్నారు. విచారణలో అవి తిరుమల నుంచి వచ్చాయని తేలింది’’ అంటూ విమర్శలు గుప్పించింది.

అయితే, దీనికి మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక వేళ తిరుమల శ్రీవారి తలనీలాల వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మంత్రి నాని మండిపడ్డారు. అసలు ఇంతకీ శ్రీవారి తలనీలాలను అక్రమంగా తరలిస్తున్న వారెవరు? టిటిడి బోర్డు కనుసన్నలలోనే అన్నీ జరగాల్సి ఉండగా స్వామివారికి భక్తులు సమర్పించిన తలనీలాల స్మగ్లింగ్ వారికి తెలియకుండా సాధ్యమవుతుందా ? కోట్ల రూపాయల ఖరీదు చేసే స్వామివారికి సమర్పించిన తలనీలాల స్మగ్లింగ్ ముఠా వెనుక ఉన్నది ఎవరు ? అన్న అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement