Tuesday, September 17, 2024

Political Story – ఖ‌మ్మం గుమ్మం గులాబీదే….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి స్ట్రోక్‌ ఇచ్చేలా గులాబీ బాస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ గెలుపు కోసం రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేసేలా వారి అస్త్రాన్ని వారిపైనే ప్రయోగిస్తున్నారు. ఆపరేషన్‌ ఖమ్మం జిల్లాను మొదలు పెట్టారు. గెలుస్తా మంటూ సవాళ్లు విసురుతున్న కాంగ్రెస్‌ నేతలకు దిమ్మతిరిగేలా షాక్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి ఎన్నికలకు ముందే చెక్‌ పెట్టేలా పెద్ద ఎత్తున చేరికలు ఉండనున్నాయి. ఇప్పటికే గులాబీ గూటికి సొంత పార్టీ నేత లను తీసుకువచ్చేలా చర్చలు పూర్తయ్యాయి. భారాస పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రధాన అనుచరు డిగా ఉన్న తెల్లం వెంకటరావు తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. గురు వారం ఉదయం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రి హరీష్‌ రావుల సమక్షంలో తెల్లం వెంకటరావు గులాబీ కండువా కప్పుకోనున్నారు. భద్రాచలం నుంచి గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి తెల్లం వెంకటరావు ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయనకు టికెట్‌ కేటాయించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో గురువారం గులాబీ కండువా కప్పుకోనున్న తెల్లం వెంకటరావుతో పాటు దాదాపు 200 మంది వరకు కాంగ్రెస్‌ నేతలు పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

భద్రాచలం నుంచి బరిలోకి..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా తెల్లం వెంకటరావు ఉన్నారు. 2018లో తెల్లం వెంకటరావు బీఆర్‌ఎస్‌ నుంచి భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించి పొంగులేటితో #హస్తం కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ మళ్లిd పొదెం వీరయ్యకే ఇచ్చే అవకాశం ఉండటంతో తెల్లం మనస్సు మార్చుకున్నారు. భారాస నుంచి టికెట్‌ కన్ఫామ్‌ ఆఫర్‌ రావడంతో తిరిగి సొంత గూటిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇతనితో పాటు పెద్ద ఎత్తున అనుచరులు పార్టీలో చేరనున్నారు. చేరికలకు సంబంధించి బుధవారం సీఎం కేసీఆర్‌తో ఖమ్మం జిల్లా నేతలు సమావేశం అయ్యారు. ప్రగతి భవన్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కొద్దిసేపు చేరికలపై చర్చించారు.

టచ్‌లో ప్రధాన అనుచరులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉండనున్నాయి. మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి చెక్‌ పెట్టేందుకు అధిష్టానం అతని వర్గాన్ని భారాస గూటికి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్నా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారాస ప్రభావం అంతంత మాత్రంగానే ఉందన్న భావనను సీఎం కేసీఆర్‌ పార్టీ నేతల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి ఖమ్మం మొత్తం గులాబీ జెండా ఎగరవేసేలా చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా మొదట పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి #హవాకు కళ్లెం వేసేలా గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారు. పొంగులేటితో ఉన్న సగం మంది ప్రధాన అనుచరులు గులాబీ నేతలతో టచ్‌లోకి వచ్చారు. వారంతా భారాసలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. మొదట తెల్లం వెంకటరావుతో పాటు పలువురు ప్రధాన అనుచరులు పార్టీలో చేరేందుకు నిర్ణయించారు. దాదాపు ఐదు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్‌లోని కీలక నేతలు భారాస కండువా కప్పుకోబోతున్నారు. ఈ చేరికలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉంటాయని భారాస కీలక నేత వెల్లడించారు.

భారాస సీరియస్‌..
ఖమ్మంలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో కూడిన రాజకీయ వాతావరణం నడుస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అసెంబ్లిd గేటు తాకనివ్వనని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి శపథం చేశారు. భారాసను ఓడిస్తానంటూ సవాల్‌ చేసి కాంగ్రెస్‌ గూటికి చెరిన పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో తన అనుచరులను గెలిపించుకోవాలని చూస్తున్నారు. కొంత మంది టికెట్‌ ఆశించిన నేతలు భారాస నుంచి పొంగులేటితో కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లారు. వారంతా తిరిగి మళ్లిd కారెక్కనున్నారు. ప్రధాన నేతలతో మొదటి దశ చర్చలు పూర్తి అయ్యాయి. రెండో దశలో మరికొంత మంది కీలక లీడర్లు గులాబీ చెంతకు చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యతోనూ చర్చలు జరిపినట్లు సమాచారం. ఆయన కూడా త్వరలోనే కారెక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది.

ట్రబుల్‌ షూటర్‌ ఆపరేషన్‌
తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్‌ షూటర్‌గా పేరుగాంచిన మంత్రి హరీష్‌ రావుకు ఖమ్మం బాధ్యతలను అధినేత కేసీఆర్‌ అప్పగించారు. అనంతరం పలుమార్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హరీష్‌ రావు పర్యటించారు. స్థానిక నేతల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ తెప్పించుకొని ఆపరేష్‌ను కొనసాగించారు. పొంగులేటి బలాన్ని దెబ్బ తీశారు. తెల్లం వెంకటరావు ప్రస్తుతం చేరుతున్న త్వరలో పెద్ద ఎత్తన చేరికలు ఉండనున్నట్లు గులాబీ నేతలు తెలుపుతున్నారు. టికెట్‌ ఆఫర్లతో పొంగులేటి శిబిరంలో కలవరం మొదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement