Saturday, November 23, 2024

ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో.. ప్రత్యర్థులకు పరాజయమే

రాజకీయాల్లో అపర చాణిక్యుడిగా మరోసారి ప్రశాంత్ కిషోర్ (పీకే) నిలిచారు. తాజాగా జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ పీకే ఎన్నికల వ్యూహాలు విజయవంతం అయ్యాయి. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే పార్టీలు విజయబావుటా ఎగరవేయడంతో పీకే ముఖ్యపాత్ర వహించడం విశేషం. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కామన్ పాయింట్ ఏంటంటే ఆయా పార్టీల ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించారు. తమిళనాడులో డీఎంకే అధికారం సాధిస్తుందని అందరూ భావించినా.. బెంగాల్‌లో మాత్రం బీజేపీ నుంచి టీఎంసీకి తీవ్రస్థాయిలో పోటీ ఎదురైంది. కానీ ప్రస్తుత ట్రెండ్స్ చూస్తే 2016లో టీఎంసీకి ఎన్ని సీట్లు వచ్చాయో.. మళ్లీ దాదాపు అదే స్థాయిలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ సీట్లు కైవసం చేసుకుని అధికారం చేపట్టే దిశగా సాగుతోంది. ముఖ్యంగా దీదీ విజయం వెనుక వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హస్తం అధికంగా ఉందని రాజకీయ పండితులు చెప్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మమతా బెనర్జీ ముఖ్యంగా స్థానిక విషయాల మీదే మాట్లాడేలా చేయడంలో పీకే వ్యూహం రచించారని, అదే ఇప్పుడు టీఎంసీ విజయానికి కారణమైందని టాక్ వినపడుతోంది.

ఈ నేపథ్యంలో టీఎంసీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గతంలో చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘200కు పైగా స్థానాల్లో టీఎంసీ గెలుస్తుంది. బీజేపీని 100 కంటే తక్కువ స్థానాలకే కట్టడి చేస్తాం. బీజేపీ మూడంకెల స్థానాలను అందుకుంటే నేను రాజకీయ సర్వేల నుంచి తప్పుకుంటా’ అని పీకే గతంలో సవాల్ చేయగా.. ప్రస్తుతం ట్రెండ్స్ అలానే వస్తున్నాయి. అలాగే తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకేని మట్టి కరిపించి డీఎంకేను అధికారంలోకి తెచ్చేలా ప్రశాంత్ కిషోర్ సఫలీకృతమయ్యారు. 2014లో మోదీకి, 2015లో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌కు, 2019లో ఏపీ సీఎం జగన్‌కు, 2020లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ విజయవంతమైన సంగతి తెలిసిందే.

అటు ప్రశాంత్ కిషోర్‌పై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ప్రశంసలు కురిపించారు. బెంగాల్, తమిళనాడులో ప్రశాంత్ కిషోర్ టీమ్‌లే గెలిచాయని వెల్లడించారు. మమతా బెనర్జీని బీజేపీ ఎంత టార్గెట్ చేసినా పీకే ఎత్తుల ముందు వారి పాచికలు పారలేదని విశ్లేషించారు. దేశంలోనే వీరనారిగా ఆమె గెలిచారని కితాబిచ్చారు. తమిళనాడులోనూ పీకే వ్యూహాలే పైచేయి సాధించాయని, స్టాలిన్‌ను సీఎంగా చేస్తున్నాయని వివరించారు. మొత్తంగా పీకే వ్యూహాలే విజయవంతమయ్యాయని సోమిరెడ్డి వ్యాఖ్యానించడం విశేషం.

కాగా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఫలితాల రోజే ఓ బాంబు పేల్చారు. ఇక నుంచి తాను ఎన్నికల వ్యూహాలు రచించబోనని, ఏ పార్టీకి పనిచేయనని స్పష్టం చేశారు. ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. బెంగాల్‌లో బీజేపీ హిందూత్వ కార్డును విరివిగా వాడినా, ఎన్నికల సంఘం చూసీ చూడనట్లు వదిలేసినా.. చివరికి విజయం మాత్రం తృణమూల్‌నే వరించినట్లు ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement