నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడింది. ఏప్రిల్ 17న ఎన్నిక జరగనుంది. సాగర్ ప్రచారానికి ఇవాళ, రేపే గడువు ఉండటంతో… ప్రధాన పార్టీల నేతలు వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. పార్టీల రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలంతా నియోజకవర్గంలో మఖాం వేసి… తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో అధికార టీఆర్ఎస్ ప్రచారం సాగిస్తుండగా… ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి.
ప్రధాన పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలతో నాగార్జునసాగర్ ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీల సీనియర్ నేతలంతా రంగంలోకి దిగి…. అభ్యర్థులకు మద్దతుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తున్నారు. గత ఏడేళ్లుగా రాష్ట్రంలో, సాగర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని టీఆర్ఎస్ వివరిస్తూ ప్రచారం చేస్తోంది. మంత్రుల, తలసాని, జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితర మంత్రులు నియోకవర్గం వ్యాప్తంగా జోరుగా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీలపై విమర్శలకు పదను పెట్టారు. ఈ రోజు సీఎం కేసీఆర్ సైతం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభతో ఫైనల్ టచ్ ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
ఇక, కాంగ్రెస్.. జానారెడ్డికి ఉన్న సానుభూతి కలిసి వస్తుందని భావిస్తోంది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, భట్టి తదితర నేతలంతా జానారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి వ్యాఖ్యానించారు.
మరోవైపు బీజేపీ కూడా జోరుగా ప్రచారం కొనసాగిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అభ్యర్థి రవి నాయక్ తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మొత్తంగా ప్రచారానికి ఇంకా రెండు రోజులే గడువు ఉండడంతో ప్రధాన పార్టీలన్ని ప్రచార జోరు పెంచాయి.