ఇద్దరు రాజకీయ నేతలను దుండగులు హత్య చేశారు. ఈ సంఘటన కేరళలోని అళప్పుజ జిల్లాలో చోటు చేసుకుంది. సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కేరళ విభాగం కార్యదర్శి కేఎస్ షాన్ శనివారం రాత్రి హత్యకు గురికాగా… ఆదివారం బీజేపీ ఓబీసీ మోర్చా కేరళ విభాగం కార్యదర్శి రంజిత్ శ్రీనివాస్ ను హతమార్చారు. ఈ హత్యలను సీఎం పినరయి విజయన్ ఖండించారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ రెండు హత్యలతో అళప్పుజ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా జిల్లాలో 144 సెక్షన్ విధించారు. కేఎస్ షాన్ గతరాత్రి పార్టీ ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో కారులో వచ్చిన దుండగులు ఆయన బైక్ ను ఢీకొట్టారు. కిందపడిపోయిన షాన్ పై తీవ్రంగా దాడి చేశారు. షాన్ కొచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా రంజిత్ శ్రీనివాస్ ను దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి మరీ అంతమొందించారు. షాన్ హత్యకు ప్రతీకారంగానే కొన్ని గంటల వ్యవధిలోనే రంజిత్ హత్య జరిగినట్టు భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..