– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా పిలిచే.. BRS.. సమైక్య ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటానికి నాయకత్వం వహించింది. ఆ పార్టీ రెండు పర్యాయాలు చాలా ఘట్టాలుగా చెప్పుకోవచ్చు. కానీ, అధికార పార్టీ ఇప్పుడు కాస్త వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి గట్టి సవాల్‌ని ఎదుర్కొంది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ని పాలించిన కాంగ్రెస్ కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోనూ, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఓడిపోయి అక్కడా, ఇక్కడా కోలోకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆ పార్టీ దయనీయ స్థితికి ప్రధానంగా నాయకత్వ లోపంతోపాటు, మితిమీరిన అంతర్గత స్వేచ్ఛ కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు.
అయితే.. చారిత్రక నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో రేవంత్ రెడ్డి వంటి మంచి చాతుర్యం ఉన్న లీడర్ దొరకడం కూడా అదృష్టంగానే భావించాలి. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి రావడం ఆసక్తికర పరిణామం. తన సోదరుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో విభేదించిన షర్మిల, సమైక్య రాష్ట్రానికి సీఎంగా తన తండ్రి ప్రజాకర్షక జ్ఞాపకాలను గుర్తుపెట్టుకోవాలని ఆశిస్తూ 2021లో తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కుటుంబంలో విభేదాల కారణంగా ఏపీని వదిలి షర్మిల తెలంగాణకు వచ్చారనే ఊహాగానాలున్నాయి.
తెలంగాణలో రాజకీయంగా చోటు సంపాదించుకోవడం కుటుంబ సభ్యుల వ్యూహమని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. అయితే తన కుమార్తెకు అండగా ఉండేందుకు.. వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా చేసి హైదరాబాద్ వచ్చారు. కాగా, జగన్‌తో సఖ్యత లేని కారణంగా ఇలా చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక.. జగన్ తన తల్లి, సోదరి నుండి దూరం అయ్యారు. ఈ క్రమంలో దివంగత వైఎస్‌ఆర్ తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వివేకా కుమార్తె సునీత కుటుంబంలో చిచ్చు రేపింది. ఈ కేసులో జగన్ మద్దతుదారుడైన వైఎస్ అవినాష్‌రెడ్డిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ, ఏపీ సీఎం, విజయమ్మ, షర్మిల నుంచి సునీతకు మద్దతు లభించింది.
కాగా, సొంత పార్టీని ప్రారంభించిన షర్మిల ఏడాది కాలంగా తెలంగాణలో BRS, ఆ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్‌పై దుమ్మెత్తిపోస్తూ రాజకీయ ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అసలు అంచనాకు మించి రూ. 40,000 కోట్లకు మూడు రెట్లు పెరిగిందన్న ఆరోపణలపై కేసీఆర్‌ను టార్గెట్ చేసుకుని సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. షర్మిల ధోరణి, వ్యవహారశైలి కారణంగా తెలంగాణలో ఆందోళనలు చెలరేగాయి. దీంతో లా అండ్ ఆర్డర్ ఇష్యూ కారణంగా కొన్ని సందర్భాల్లో పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అయితే.. అత్యంత రాజనీతిజ్ఞుడిగా పేరుగాంచిన అపర చాణక్యుడు అయిన కేసీఆర్ పార్టీని దెబ్బతీయగల సత్తా ఆమెకు ఉందా? అనే అనుమానం చాలామందిలో ఉంది. అందులో షర్మిల ఆంధ్ర ప్రదేశ్‌కి చెందినదని, తెలంగాణలో తనకేం పని అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల వైరం గురించి తెలంగాణ ప్రజలు ఇంకా మరిచిపోలేదు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయడానికి షర్మిల ఆసక్తి చూపలేదు. దీంతో ఆమె రాజకీయ బలం ఎంత అనేది ఇంకా స్పష్టం కాలేదు.
అంతేకాకుండా.. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా షర్మిల చేస్తున్న ప్రచారం తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్‌కు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీకి లాభదాయకంగా మారుతుందనే వాదన కూడా ఉంది. దీంతో షర్మిల బీజేపీకి చెందిన ‘బి’ పార్టీ అని, ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓట్ల చీల్చే యత్నంలో భాగంగానే కొత్త పార్టీ పెట్టారన్న వాదలు తెరపైకి వచ్చాయి. అయితే.. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు షర్మిల కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తాజా అడుగులను బట్టి తెలుస్తోంది. తను బీజేపీ ‘బీ’ టీమ్ అనే అభిప్రాయాన్ని తొలగించేందుకు షర్మిల అడుగులు వేస్తోంది. ఆమె సోదరుడు ఏపీ సీఎం జగన్ ఇప్పటికే బీజేపీకి బాగా దగ్గరయ్యాడు. వీటన్నిటి నడుమ షర్మిల తీసుకోబోయే నెక్ట్స్ స్టెప్ గురించి ఇప్పుడు హాట్ హాట్ చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టవచ్చనే ఆలోచనలో షర్మిల ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకున్నారనే ఆరోపణలకు చెక్ పెడుతూనే, కాంగ్రెస్‌తో పొత్తు వల్ల ఆమె పార్టీకి తెలంగాణలో పట్టు సాధించడం కూడా లాభిస్తుంది. షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే చర్చ కూడా సాగుతోంది. కానీ, కాంగ్రెస్‌తో పొత్తు లేదా విలీనం తెలంగాణ యూనిట్‌లో సమస్యలను సృష్టించవచ్చు. 2021లో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి పార్టీని బీఆర్‌ఎస్‌కు సవాలుగా మార్చడానికి తీవ్రంగా కృషి చేస్తున్నప్పటి నుండి రాష్ట్ర యూనిట్ అటువంటి చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
అంతేకాకుండా.. కర్నాటకలో కాంగ్రెస్ విజయం.. రెండు రాష్ట్రాల మీదుగా సాగిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా కాస్త ఆ పార్టీలో జోష్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని పార్టీలో కర్నాటక విజయం కొత్త ఆశలను చిగురింపజేసింది. ఇక.. షర్మిలతో పొత్తుపై కాంగ్రెస్ హైకమాండ్ అభిప్రాయం తెలియదు, కానీ డీకే శివకుమార్ నిర్ణయం పార్టీని ప్రభావితం చేయవచ్చు. గ్రేటర్ హైదరాబాద్‌లో గణనీయ సంఖ్యలో ఉన్న రెడ్డి సామాజికవర్గం ఓట్లను కూడగట్టేందుకు షర్మిల ఉపయోగపడుతుందనే ఆశతో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇట్లాంటి తాజా రాజకీయ పరిణామాల మధ్య షర్మిల డీకేని కలవడం, తన తదుపరి స్టెప్ ఏంటన్న దానిపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.