మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్ర రాజకీయం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. అయితే ఈ సంక్షోభం నేపధ్యంలో శివసేన రెబెల్ గ్రూప్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు కాషాయ పార్టీ పావులు కదుపుతోంది.
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న క్రమంలో మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు ఫడ్నవీస్ హస్తిన బాటపట్టారు. మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్ధితిపై చర్చించేందుకు ఫడ్నవీస్ నివాసంలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ భేటీ అనంతరం ఆయన బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్లడంతో రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయనే ఉత్కంఠ నెలకొంది. ఫడ్నవీస్ సీఎంగా ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలకు కీలక మంత్రి పదవులు కట్టబెట్టేలా ప్రభుత్వ ఏర్పాటు దిశగా కసరత్తు సాగుతోందని ప్రచారం సాగుతోంది.