ఏపీలో త్వరలో జరగనున్న తిరుపతి ఉపఎన్నికపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి మాజీ ఐఏఎస్ కె.రత్నప్రభ పోటీ చేస్తుండటంతో రాజకీయం వేడెక్కింది. ఎందుకంటే ఆమె సీఎం జగన్ ఆస్తుల కేసులో ముద్దాయిగా ఉంది. ఆస్తుల కేసులో జగన్ A1గా, ఎంపీ విజయసాయిరెడ్డి A2గా ఉండటంతో పాటు కె.రత్నప్రభ A9గా ఉన్నారు. A1, A2 వైసీపీలో ఉండగా A9 బీజేపీలో ఉండటం ప్రజలకు పలు అనుమానాలకు తావిస్తోందని జనం అంటున్నారు. ఉపఎన్నిక కోసం వైసీపీకి, బీజేపీకి లోపాయికార ఒప్పందం కుదిరిందా అని ప్రశ్నించే వారు లేకపోలేదు. దీంతో బీజేపీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అందుకే వైసీపీ నుంచి ఎవరికీ తెలియని గురుమూర్తి అనే అభ్యర్థిని నిలబెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గురుమూర్తి జగన్ పాదయాత్ర సమయంలో ఫిజియోథెరపిస్టుగా పనిచేశారు. దీంతో ఆయన సేవలను గుర్తించి వైసీపీ ఏకంగా ఎంపీ టిక్కెట్ కేటాయించింది.
అయితే తిరుపతి ఎంపీ టిక్కెట్‌ను వైసీపీలో బడా నేతలు చాలామంది ఆశించారు. కానీ సీఎం జగన్ గురుమూర్తికి కేటాయించడంతో వాళ్ల అవకాశాలకు గండిపడింది. అటు బీజేపీ రత్నప్రభకు ఎంపీ టిక్కెట్ ఇవ్వడంతో ఆమె జనసేన + బీజేపీ ఉమ్మడి అభ్యర్ధా లేదా వైసీపీ + బీజేపీ ఉమ్మడి అభ్యర్ధా అని ప్రశ్నిస్తున్నారు. అటు మంగళవారం నాడు ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కూడా ఈ అంశంపై మాట్లాడారు. తిరుపతి ఉపఎన్నికలో ఒకవేళ వైసీపీ అభ్యర్థి గెలుపొందినా కేంద్రంలో బీజేపీకి సాయపడటం తప్ప మరే ప్రయోజనం ఉండదని.. అభ్యర్థులు వేరైనా వైసీపీ, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు.
కాగా బుధవారం నాడు తిరుపతి ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ ఘట్టం మంగళవారంతో ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు మొత్తం 34 మంది నామినేషన్ వేశారు. వీటిని రిటర్నింగ్ అధికారి చక్రధర్‌బాబు బుధవారం పరిశీలించనున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న నామినేషన్లను ఆయన స్వీకరిస్తారు.