Friday, November 22, 2024

Big Story: పొలిటికల్‌ దూకుడు.. బీజేపీ టార్గెట్‌గా గులాబీ దళపతి వ్యూహాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఓ వైపు కరోనా కరాళ నృత్యం చేస్తున్న తరుణంలో ఇంకోవైపు చాపకింద నీరులా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. లెక్కప్రకారం తెలంగాణలో ఎన్నికలకు మరో ఏడాది న్నరకు పైగా సమయం ఉండగా, ఎన్నికలు ఈ ఏడాదే జరగబోతున్నాయన్నంత హడావుడిని రాజకీయపార్టీలు ప్రదర్శిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ మధ్య యుద్ధవాతావరణం నెలకొనగా, హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం వెలువడినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని టార్గెట్‌ చేస్తూ.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వరి ధాన్యం కొనుగోలు దగ్గరి నుంచి ప్రతీ విషయంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయమే చేస్తోందంటూ గులాబీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా హైదరాబాద్‌లో ధర్నాకు పూనుకోవడం, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లిdలో తెలంగాణ మంత్రులు మకాం వేయడం అన్నీ సంచలనమయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలు సైతం టీఆర్‌ఎస్‌ వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నుతూ ముందుకు సాగుతున్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ జీవో 317కు వ్యతిరేకంగా ఉద్యమించిన నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేయడం.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. తన నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో దీక్షకు పూనుకున్న బండి సంజయ్‌ని అరెస్టు చేయడం, ఆయన్ని పలు పోలీస్‌ స్టేషన్లు చుట్టూ తిప్పడం, నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం, చివరికి న్యాయస్థానం జోక్యంతో ఆయనకు బెయిల్‌ లభించడం.. ఇవన్నీ స్టేట్‌ పాలిటిక్స్‌లో పెద్ద చర్చకే దారి తీశాయి. సంజయ్‌ విడుదల తర్వాత బీజేపీ జాతీయ స్థాయి నేతలు తెలంగాణకు క్యూ కట్టారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, అసోం ముఖ్యమంత్రి హేమంత్‌ బిశ్వ శర్మ, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌సింగ్‌ తదితరులు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణకు తరలివచ్చారు. ఇలా పార్టీ నిర్దేశించిన కీలక నేతలు తెలంగాణకు రావడం.. బీజేపీ అధిష్టానం తెలంగాణపై దృష్టి పెట్టిందనడానికి సంకేతంగా భావిస్తున్నారు.

బండి సంజయ్‌ దూకుడు కారణంగా రాష్ట్రంలో బీజేపీ బల పడుతుందని, దాన్నే ఆసరాగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో గెలిచేలా బీజేపీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ దిశగా బీజేపీ అధినాయకత్వం పలు కమిటీలను వేసింది. పార్టీ సీనియర్‌ నేత, ఉమ్మడి ఏపీ కమిటీ మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డికి పార్టీ నేతల మధ్య సమన్వయం చెడకుండా చూసే కీలక బాధ్యతలను అప్పగించారు. అదే సమయంలో తెలంగాణలోని ఎస్సీ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి అప్పగించారు. ఇక తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించి… రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరిన మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావుకు ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలు కట్టబెట్టారు. 2023లో జరగబోయే అసెంబ్లిd ఎన్నికలకు పకడ్బందీ ప్రణాళికతో సిద్ధం కావడంలో భాగంగా పార్టీలో చేరికలు, సమన్వయం, ఎస్సీ, ఎస్టీ అసెంబ్లిd నియోజకవర్గాల్లో సమన్వయానికి ఈ మూడు కమిటీలను నియమించారు. 2018 మాదిరిగానే 2023 డిసెంబర్‌కు ముందే.. అంటే 2023 తొలి నెలల్లోగానీ.. లేకపోతే 2022 చివరిలోగానీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నేతలు భావించడమే ఈ హడావుడికి కారణమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

శాసనసభ ఎన్నికలు 2023 చివరలో జరగాల్సి ఉన్నా అంతకంటే ముందుగానే ఇక్కడ ఎన్నికలు జరగవచ్చనే ఊహాగానాల మధ్య 119 నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో పట్టున్న, బలమైన పార్టీ ముఖ్య నేతలు పోటీకి అవకాశమున్న స్థానాలను మినహాయించి మిగతా సీట్లలో ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవాలని భావిస్తోంది. అందుకే తాజా కమిటీల నియామకమని పలువురు భావిస్తున్నారు. రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాలపై బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement