ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సంగ్రాం సింగ్ పాటిల్ పూర్తి వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ నెల 6న ఆదివారం సాయంత్రం 6 గం. ల సమయంలో ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకులు బడే చొక్కారావు (దామోదర్), కొయ్యాడ సాంబయ్య ఆదేశాల మేరకు JMMWP డివిజనల్ కమిటీ వారు కంకణాల రాజిరెడ్డి (వెంకన్న), కుర్సం మంగు (భద్రరు), వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీకి చెందిన ముచకి ఉంగళ్ (రఘు, సుధాకర్), RPC సభ్యులు, మరికొంత మంది మిలీషియా సభ్యులు కలిసి కూంబింగ్ చేసుకుంటూ వచ్చే పొలీసులని చంపాలనే ఉద్దేశంతో సాయుధులై సమావేశమయ్యారు.
అనుకున్నట్లుగా పథకం ప్రకారం వాజేడు మండలంలోని పెనుగోలు గ్రామంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో మందు పాత్రలు అమర్చినట్లు నమ్మదగిన సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశానుసారం కే శివ ప్రసాద్ వెంకటాపురం సీఐ, వాజేడు ఎస్ఐ కే తిరుపతిరావు, హరీష్‌లతో పాటు PC-292 & 2722, స్పెషల్ పార్టీ ములుగు, CRPF 39(సి) Bn అధికారులు, BD టీంలు కలిసి పెనుగోలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో పెనుగోలు నుండి పామునూరుకు వెళ్ళే దారిలో తనిఖీలు చేశారు.
అక్కడ మందుపాతరకి అమర్చే ఎలక్ట్రిక్ వైర్ కనిపించడంతో BD సిబ్బంది తనిఖీ చేసి ఆ కనిపించే వైర్ ద్వారా కలిపి చూడగా బాంబులు ఉన్నట్లుగా గుర్తించారు. అనంతరం వాటిని తగు జగ్రత్తలతో నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. అయితే ఆ ప్రదేశమంతా వెతకగా చూడగా.. దాదాపు 18 వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీ వారు అమర్చిన ల్యాండ్ మైన్స్ పేలి ఎన్నో ప్రాణాలు పోయాయి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో తిరిగే వారు అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా అనుమానాలు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.