హైదరాబాద్‌లోని రాడిసన్ పబ్‌లో డ్రగ్స్ బయటపడ్డాయి. పోలీసుల దాడుల్లో 6 గ్రాముల కొకైన్ ను గుర్తించారు. దీంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల దాడులతో బెంబేలెత్తిన యువకులు పరుగులు తీశారు. పబ్‌లో ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ పడేశారు. బాత్ రూమ్, డ్యాన్స్ ఫ్లోర్లలో డ్రగ్స్ ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ వ్యవహారంపై ఇటీవల సిటీ పోలీసు కమిషనర్ వార్నింగ్ ఇచ్చిన పబ్ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు పబ్ నిర్వాహకులు. పబ్ లలో విచ్చలవిడిగా డ్రగ్స్ ను వినియోగిస్తున్నారు. పబ్ లే డ్రగ్స్ సరఫరాకు అడ్డాలుగా మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్‌లో భాగంగా ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్‌లో పార్టీ జరుగుతున్నదని, అందులో పాల్గొన్న పలువురు డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. పబ్‌ను సమయానికి మించి నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారందరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే మత్తులో ఉన్న యువకులు ఠానాలో హంగామా చేశారు. తమను ఎందుకు తీసుకువచ్చారని ఆందోళనకు దిగారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 39 మంది యవతులు, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు.