Wednesday, November 20, 2024

పుట్ట మధును ఇంటికి పంపిన పోలీసులు

హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల హత్యకేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధును పోలీసులు ఇంటికి పంపారు. వామన్ రావు తండ్రి ఫిర్యాదు చేయడంతో అజ్ఞాతంలో ఉన్న మధును ఏపీలో భీమవరంలో రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనను రామగుండం కమిషనరేట్‌కు తీసుకొచ్చి విచారణ చేపట్టారు. గత మూడు రోజుల నుంచి పుట్టా మధును కేసుకు సంబంధించి పలు అంశాలపై ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విచారణ ముగిసిన అనంతరం పోలీస్ కస్టడీ నుంచి సోమవారం అర్థరాత్రి పుట్ట మధును ఇంటికి పంపారు. ఇదే సమయంలో తిరిగి విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని ఆదేశించారు.

సోమవారం రామగుండం కమిషనరేట్‌లో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు, ఆయన భార్య శైలజతో పాటు మధుకు సన్నిహితుడిగా పేరున్న కమాన్‌ పూర్‌ వ్యవసాయ కమిటీ ఛైర్మన్‌ పూదరి సత్యనారాయణను విచారణ అధికారులు రోజంతా వివిధ కోణాల్లో ప్రశ్నించారు. హత్యకు ముందు, తరువాత జరిగిన ఫోన్‌ కాల్‌డాటాతో పాటు ఆర్థిక లావాదేవీల పైనే పోలీసులు ఆరా తీసినట్లు సమాచారం. మధు కుటుంబీకులు, సన్నిహితులకు సంబంధించిన 32 బ్యాంకు ఖాతాల వివరాల ఆధారంగా విచారణను ముమ్మరంగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రెండుకోట్ల వ్యవహారంలో స్పష్టత కోసం పోలీసులు దృష్టి పెట్టారు. 12 బ్యాంకుల నుండి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement