గోసంరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, అలాంటి వారిపై కఠిన చర్యలుంటాయన్నారు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్. జూన్ 27న జరగనున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో ఈ హెచ్చరిక చేశారు. అక్రమ పశువుల రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు కానీ, జీహెచ్ఎంసీ, ఇతర అధికారులకు తెలియజేయాలన్నారు. దీన్ని సాకుగా చూపి ఎవరూ దాడులకు పాల్పడొద్దని సీపీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్పీసీసీసీ)లో జరిగిన ఇంటర్ డిపార్ట్ మెంట్ కో ఆర్డిరేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
పండుగ సీజన్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరమన్నారు సీపీ ఆనంద్. పశుసంవర్ధక శాఖ, స్థానిక పోలీసులు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సమన్వయంగా నడుచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పశువుల రవాణా, పశువుల వధ సమయంలో వర్తించే చట్టాల గురించి వివరించారు.