పలు పోలీస్ స్టేషన్ లను బస్తీ రేంజ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ కే భరద్వాజ్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో ఆయన ఆ జిల్లాలో ఉన్న ఖలీలాబాద్ పోలీస్ స్టేషన్‌ను కూడా సందర్శించారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసుల సామర్థ్యాలను ఆయన పరీక్షించారు. ఈ సందర్భంగా ఓ ఎస్ఐ ను రైఫిల్ లోడ్ చేయాలని ఆయన సూచించారు. కానీ ఆ ఎస్ ఐ దానిని లోడ్ చేయలేకపోయాడు. బుల్లెట్లను గొట్టం ద్వారా వేసేందుకు ప్రయత్నించాడు. గన్ ను సరిగా పట్టుకోలేకపోయాడు. దీంతో ఐజీ నివ్వెరబోయారు. అక్కడే అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకరు తమ సెల్ ఫోన్ లో రికార్డు చేశారు.
అది సోషల్ మీడియా వరకు ఎలా చేరిందో తెలియదు గానీ.. ఒక్క సారిగా వైరల్ అయ్యింది. ‘వావ్ యూపీ పోలీసులు’ అంటూ ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ అయిన ఈ వీడియో ఉత్తరప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ వద్దకు చేరింది. దీంతో ఆ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఆ వీడియోను సమాజ్ వాదీ పార్టీ ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ఉత్తరప్రదేశ్ పోలీసుల అసమర్థతపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. యోగి జీ.. పోలీసులకు తుపాకీ ఎలా ఎక్కించాలో కూడా తెలియదు! తుపాకీ బారెల్‌లోంచి బుల్లెట్‌ని చొప్పించిన యుపీ పోలీసులు అజ్ఞానానికి పరాకాష్ట. పేద, అమాయక ప్రజలను వేధిస్తున్న బీజేపీ ప్రభుత్వ క్రమశిక్షణ లేని పోలీసు ఎస్‌ఐకి తుపాకీ ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు. ఇది చాలా అవమానకరం. అలాంటి పోలీసులు పోలీసు శక్తిని మెరుగుపరుస్తారా..అని పేర్కొంటూ సమాజ్‌వాదీ పార్టీ హిందీలో ట్వీట్ చేసింది.ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.