ఒ పరి.. ఓ పరి.. అంటూ యూత్‌ని ఉర్రూతలూగించేలా ప్రైవేట్ ఆల్బమ్ క్రియేట్ చేసిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. హిందువులను, దేవుళ్లను కించపరిచేలా పాటలో పదాలు వినియోగించారని సినీ నటి కరాటే కళ్యాణి ఈ ఫిర్యాదు చేశారు. కరాటే కల్యాణితోపాటు పలు హిందూ సంఘాలు చేసిన ఫిర్యాదుతో డీఎస్పీపై కేసు నమోదు చేసినట్లు స్టేషన్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.
‘ఓ పరి’ అనే ప్రేవేట్ ఆల్బమ్‌లో “హరే రామ – హరే కృష్ణ” మంత్రంపై అశ్లీల నృత్యాలు చేశారని హిందు సంఘాలు, కరాటే కల్యాణి రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. హిందువుల మనోభావాలను దేవిశ్రీ దెబ్బతీయడానికి చూస్తున్నారని కరాటే కల్యాణి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై న్యాయ సలహాలు తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీపీ స్పష్టం చేశారు.
దేవీ శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. టాలీవుడ్‌లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు. ఈ రాక్ స్టార్ కంపోజ్ చేసిన నాన్-ఫిల్మ్ మ్యూజిక్ వీడియో ‘ఓ పరి’ సాంగ్. ఈ పాటను దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేయడమే కాకుండా స్వయంగా పాడారు కూడా. పాన్ ఇండియా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా పాట కంపోజ్ చేశారు. ఈ పాట తెలుగులో ‘ఓ పిల్లా’ పేరుతో రిలీజ్ చేశారు.