Friday, November 22, 2024

Humanity: మానవత్వం చాటిన పోలీస్ బాస్.. కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు ఆర్థిక సాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపెల్లి గ్రామంలో ఈ మధ్య పక్షవాతంతో చనిపోయిన శంకరయ్య కుటుంబానికి, అదేవిధంగా మిల్లర్ బోల్తాపడి కాలు విరిగి ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న కోమటి ఎల్లయ్య కుటుంబానికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆపన్నహస్తం అందించారు. అండగా ఉంటా.. అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. బండలింగం పల్లి గ్రామానికి వెళ్లి రెండు కుటుంబాలకు చెరో 25 వేల రూపాయల ఆర్థిక సాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు.

ఎల్లారెడ్డిపేట్ మండలం బండలింగంపల్లిలోని నిరుపేద అయిన కొండాపురం శంకరయ్యకు భార్యా, ఇద్దరు పిల్లలున్నారు. వీరు అద్దె ఇంట్లో ఉంటూ జీవనం కొనసాగిస్తుండగా శంకరయ్య ఈ మధ్యనే పక్షవాతంతో మంచానపడి చనిపోయాడు. మూడు సంవత్సరాల నుండి లక్ష్మి తన ఇద్దరు పిల్లలను సాకడానికి కూలీ పనులకు పోతూ జీవనం కొనసాగిస్తోంది. భర్త మృతితో ఆర్థిక ఇబ్బందులు పడుతోంది. తన ఇద్దరు పిల్లలతో పాటు కుటుంబ పోషణ చూసుకుంటూ అపన్నాహస్తం కోసం ఎదురు చూస్తోంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్​ హెగ్డే మానవతా దృక్పథంతో నేనున్నా అంటూ ముందుకు వచ్చారు. సోమవారం బండలింగంపల్లి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పి తన వంతుగా 25 వేల ఆర్థిక సాయం అందించారు.

ఇక.. అదే గ్రామానికి చెందిన కోమటి ఎల్లయ్య భార్య అనిత అనారోగ్యంతో మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. భార్యను కోల్పోయిన ఎల్లయ్య కుమారుడిని పోషించుకుంటూ కూలీ పనికి వెళుతున్నాడు. ఈమధ్య పని నుంచి ఇంటికి వస్తుండగా మిల్లర్ బోల్తాపడి అతని కాలు విరిగింది. దీంతో నడువ లేని స్థితిలో ఇంటికే పరిమితం అయ్యాడు. ఎల్లయ్య తీవ్ర మైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు ఎస్పీ దృష్టికి వచ్చింది. అతని దీనస్థితికి చలించిన ఎస్పీ వైద్య ఖర్చుల నిమిత్తం 25 వేల రూపాయలు అందజేశారు. ఈక్రమంలో ఎస్పీ వెంట సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, ఎల్లారెడ్డి పేట సీఐ మొగిలి, ఎస్ఐ శేఖర్, గ్రామ సర్పంచ్ తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement