భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గత ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య సంఘటనలో వనమా రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధితుడు రామకృష్ణ రాసిన సూసైడ్ లేఖ, సెల్ఫీ వీడియోలో మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ విషయంలో వనమా రాఘవేంద్రరావుపై కేసు నమోదయింది. ఎట్టకేలకు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ సరిహద్దులోని దమ్మపేట, చింతలపూడిలో రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాఘవను అరెస్టు చేసిన విషయాన్ని కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ధ్రువీకరించారు. రాఘవను పాల్వంచకు తరలించామని.. ప్రాథమిక విచారణ పూర్తిచేశాక కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.
కాగా, పాల్వంచకు చెందిన నాగ రామ కృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమార్తెలతో కలిసి ఈనెల 3న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తమ ఆత్మహత్యలకు వనమా రాఘవే కారణమంటూ చనిపోయే ముందు రామృకృష్ణ తీసిన సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. ఈ వీడియో రాజకీయంగా సంచలనమైంది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య అనంతరం వనమా రాఘవ పరారీలో ఉన్నారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట మీదుగా వాహనంలో ఏపీ వైపు పరారవుతున్న రాఘవను చింతలపూడి వద్ద రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు పట్టుకున్నారు. రాఘవను ఎస్పీ కార్యాలయంలో విచారించిన అనంతరం ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు పాల్వంచకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వరరావు ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొం టూ, బెయిల్‌పై ఉన్న రాఘవను విచారణ రావాలం టూ పోలీసులు శుక్రవారం పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా ఇంటి గోడకు నోటీసు అంటించడం చర్చనీయాంశమైంది. ఇలాఉంటే.. రాఘవను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital