హైదరాబాద్ బేగంబజార్‌లోని చేపల మార్కెట్ దగ్గర జరిగిన మర్డర్ విషయంలో పోలీసులు 24 గంటల్లోనే పురోగతి సాధించారు. హత్యకు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. భార్య సంజన బాబాయి కుమారులు, అతని స్నేహితులే నీరజ్ పన్వార్ (21) ను చంపేసినట్టు కనుగొన్నారు. వీరిని కర్నాటకలోని గురుమిత్కల్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే.. నీరజ్ పన్వార్‌ను హత్య చేసి ఈ దుండగులు కర్నాటకకు పరార్ అయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా కర్నాటక వైపు పరార్ అయ్యారని పోలీసులు గుర్తించారు. వీరే కాకుండా మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకొని, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
కాగా, నీరజ్ పన్వార్ అదే ప్రాంతానికి చెందిన సంజనను ఏడాదిన్నర కిందట ప్రేమించి, పెండ్లి చేసుకున్నాడు. వారికి రెండు నెలల బాబు కూడా ఉన్నాడు. పెండ్లి అయినప్పటి నుంచే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిన్న (శుక్రవారం) రాత్రి ఏడున్నర గంటల సమయంలో నీరజ్ పన్వార్ బేగంబజార్ చేపల మార్కెట్ ప్రాంతంలో తన బంధువు దుకాణానికి తాతతో కలిసి వెళ్లివస్తుండగా.. ఐదుగురు దుండగులు అతని బైక్‌ను అడ్డుకొని దాడికి దిగారు. వెంబడించి విచక్షణారహితంగా కత్తులు, రాడ్లతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నీరజ్‌ను ఉస్మానియా దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు.