తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలను పోలీసులు కఠినతరం చేశారు. కరోనా కట్టడిలో భాగంగా ఏపీ నుంచి వచ్చేవారికి ఈ-పాస్ తప్పనిసరి చేశారు. అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. అత్యవసర వాహనాలకు గుర్తింపు కార్డులను పోలీసులు తప్పనిసరి చేశారు. సూర్యపేట జిల్లాలోని నాలుగింటిలో మూడు చెక్‌పోస్టులను పోలీసులు మూసివేశారు. మఠంపల్లి, పులిచింతల, రామాపురం చెక్‌పోస్టులను మూసివేశారు. కోదాడ మీదుగానే ఏపీ వాహనాలకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు. దీంతో ఏపీ-తెలంగాణ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సమీపంలోని రామాపురం అడ్డ రోడ్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ పాస్ తో వాహనాలకు మాత్రమే తెలంగాణ పోలీసులు అనుమతి ఇస్తున్నారు. అంబులెన్స్ కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. లాక్‌డౌన్ సడలింపు వేళల్లోనూ ఈ-పాస్ ఉన్నవారినే అనుమతిస్తున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద.. ఏపీకి చెందిన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. లాక్‌డౌన్ సడలింపు ఉందని వాహనదారులు భారీగా తరలిరావడంతో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ-పాస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ-పాస్‌లు లేని వాహనదారులను నిలిపివేస్తున్నారు. మరోవైపు సరకు రవాణా వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
సూర్యాపేట జిల్లా సరిహద్దులో ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రం నుంచి వచ్చేవారికి ఈ-పాసులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు ఈ-పాస్ నుంచి మినహాయింపునిస్తూ అత్యవసర వాహనాలకు గుర్తింపు కార్డులు తప్పనిసరి చేస్తున్నట్లు సూర్యపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ స్పష్టం చేశారు. విచ్చలవిడిగా తిరుగుతున్న జనాన్ని అదుపు చేసేందుకే ఆంక్షలు విధిస్తున్నామన్నారు. లాక్ డౌన్ సడలింపు వేళల్లోనూ ఈ-పాస్ తప్పనిసరి చేశామన్నారు. సూర్యాపేట జిల్లాలో 4 చెక్ పోస్ట్‌లకు గానూ 3 మూసివేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ రహదారి మీదుగానే తెలంగాణలోకి రావాలని చెప్పారు. మఠంపల్లి, పులిచింతల, కోదాడ గ్రామీణ మండలం రామాపురం చెక్ పోస్టులు కాకుండా కోదాడ మీదుగానే ఏపీ వాహనాలకు అనుమతిస్తున్నట్లు ఎస్పీ వివరించారు.