గోదావరి వరద సమస్య తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. పోలవరం ప్రాజెక్టు వద్ద కాఫర్ డ్యామ్ ఎత్తుపెంచడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇట్లా చేయడం వల్లనే బ్యాక్ వాటర్‌తో భద్రాచలం వద్ద గోదావరి వెనక్కితట్టి.. ముంపునకు కారణమైందని నీటిరంగ నిపుణులు, ఇంజినీర్లతోపాటు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అంటున్నారు. దీనిపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పార్లమెంట్‌లోనూ ఈ విషయాన్ని లేవనెత్తాలని, ఎత్తు తగ్గించేలా కేంద్రాన్ని కదిలించాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు సూచించారు. అయితే.. పోలవరం విషయంలో ఇప్పుడు ఇరు రాష్ట్రాల మంత్రులు మాటల యుద్ధానికి దిగుతున్నారు. దీంతో సోదర రాష్ట్రాల మధ్య వాటర్ వార్ అగ్గి రాజేస్తోంది. అయితే.. ఇరు రాష్ట్రాల సమస్య పరిష్కరించకుండా లొల్లిపెట్టేలా కేంద్రం తీరు ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు.. ఇటీవల గోదావరి నదిలో వరదలకు కారణమైందని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఆరోపించింది. పోలవరం నుంచి నీటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల భద్రాచలం వద్ద వరదలు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నదీ తీరంలోని పలు గ్రామాలతో పాటు పట్టణంలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని మంత్రి పి.అజయ్ కుమార్ అన్నారు. బ్యాక్ వాటర్ కారణంగా భద్రాచలం వద్ద వరదలను నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం డ్యాం ఎత్తును తగ్గించాలని మంత్రి డిమాండ్ చేశారు. పోలవరం ఎత్తు తగ్గించాలని పొరుగు రాష్ట్రాన్ని తెలంగాణ డిమాండ్ చేస్తూనే ఉందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యామని చెబుతున్నారు. పరీవాహక ప్రాంతాలలో భారీ వర్షాలు, ఎగువ నుండి భారీ ఇన్‌ఫ్లోల ఫలితంగా గత వారం భద్రాచలం వద్ద వరదలు 71 అడుగులను దాటింది. ఇది మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వచ్చినట్టు అధికారులు తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 25 వేల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును ఆంధ్రప్రదేశ్ ఒక మీటర్ పెంచిన రెండు రోజుల తర్వాత తెలంగాణ మంత్రి ఈ డిమాండ్ చేశారు. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL), జూలై 15న ఎత్తు పెంచే పనులను చేపట్టి 48 గంటల్లో పూర్తి చేసింది. ప్రాజెక్టుకు 26 లక్షల క్యూసెక్కుల నుంచి 30 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయడంతో, కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. 28 లక్షల క్యూసెక్కుల వరదనీటిని తట్టుకునేలా ఎగువ కాఫర్‌డ్యామ్‌ను నిర్మించారు. పోలవరం కాఫర్ డ్యామ్ ఎత్తును 40.5 మీటర్ల నుంచి 43.5 మీటర్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పోలవరం ఎత్తును ఆమోదించిన ఎత్తు నుంచి తగ్గించే ప్రసక్తే లేదని ఏపీ సీఎం జగన్ ఇప్పటికే తేల్చిచెప్పారు.
దీంతో 2014లో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఏడు మండలాలను (బ్లాక్‌లు) తెలంగాణకు తిరిగి ఇవ్వాలని మంత్రి అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. భద్రాచలం సమీపంలోని కనీసం ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని, దీనికి సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ డిమాండ్లు రెండు రాష్ట్రాల మధ్య కొత్త వివాదానికి దారితీసే అవకాశం ఉంది. తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు వల్ల ఈ మండలాల్లోని పలు గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉన్నందున అంతర్ రాష్ట్ర వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ఇట్లా చేసినట్లు తెలుస్తోంది.
ఈ చర్య ఏకపక్షంగా ఉందని, దీనిని రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి దీని ఎత్తు తగ్గించేందుకు కేంద్రం చొరవ చూపాలి. మూడు మీటర్ల ఎత్తు పెంచేందుకు పోలవరం అసలు డిజైన్‌నే మార్చారని అన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుంటే గిరిజన గ్రామాలు ముంపునకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.