Wednesday, November 20, 2024

ఫారెస్టు గార్డును కాల్చి చంపిన వేటగాళ్లు..

వేటగాళ్లు ఫారెస్టు గార్డును కాల్చి చంపిన ఘటన ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో చోటుచేసుకుంది. వేటగాళ్ల బృందం ఫారెస్ట్ గార్డు బిమల్ కుమార్ జెనా (35)ను హతమార్చారు. ఆయన నవనా రేంజ్‌లోని బౌన్‌సఖల్ బీట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా ఆయన పితాబటా సౌత్ రేంజ్, నవ్నా నార్త్ రేంజ్ సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్నాడు. అతడితో పాటు మరో ముగ్గురు గార్డులు కూడా అక్కడే ఉన్నారు. అయితే ఈ సమయంలో వారంతా వేటగాళ్ల గుంపును చూశాడు. వారిని అదుపులోకి తీసుకునేందుకు గార్డులు ప్రయత్నించారు. ఫారెస్టు సిబ్బందిని చూసిన వేటగాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో గార్డులు అక్కడే ఉన్న తుపాకులు, జంతు మాంసాన్ని స్వాధీనం చేసుకొని బీట్ హౌస్ కు చేరుకున్నారు.

కొంత సమయం తరువాత బిమల్ కుమార్ జెనా ఎవరితోనో ఫోన్ మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే బీట్ హౌస్ లో సిగ్నల్ లేకపోవడంతో ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చాడు. కానీ అప్పటికే కోపంగా ఉన్న వేటగాళ్లు, ఈ గార్డుల కోసం బయట కాపలా కాస్తున్నారు. బిమల్ కుమార్ ను చూసి దూరం నుంచి కాల్పులు జరిపారు. తుపాకీ శబ్దం వినిపించడంతో మిగితా గార్డులు అక్కడికి చేరుకున్నారు. బాధితుడి ఛాతీలో బుల్లెట్ గాయం కనిపించింది. దీంతో వెంటనే సిబ్బంది బిమల్ ను బరిపద హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన మరణించాడని డాక్టర్లు ప్రకటించారు. ఈ ఘటనపై సమాచారం అందగానే ఫారెస్టు డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.బిమల్ మృతిపై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement