జమ్ముకశ్మీర్‌కు చెందిన రాజకీయ నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు భేటీ కానున్నారు. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేశాక అక్కడి స్థానిక రాజకీయ నేతలతో తొలిసారిగా కేంద్రప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్‌లోన్ తదితరులు భేటీలో పాల్గొననున్నారు. కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, నియోజకవర్గాల పునర్విభజన, అభివృద్ధి తదితర అంశాలను చర్చించే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేక ప్రతిపత్తి అంశాన్ని పార్టీలు లేవనెత్తే అవకాశముంది. ఆర్టికల్ 370 రద్దు చేసిన దాదాపు రెండేండ్ల తర్వాత కేంద్రం రాజకీయ ప్రక్రియను మొదలు పెట్టడం, అఖిలపక్ష నేతలను భేటీకి ఆహ్వానించడం, నేతలు కూడా సమావేశానికి హాజరయ్యేందుకు సముఖంగా ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే అఖిలపక్ష నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు.
87 స్థానాలున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి 2014లో ఎన్నికలు జరిగాయి. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేశారు. జమ్ముకశ్మీర్, లఢక్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలిపింది. జమ్ముకశ్మీర్ కి చెందిన రాజకీయ పార్టీల నాయకులను దాదాపు ఏడాదికిపైగా నిర్భందించారు. పరిస్థితులు చక్కబడ్డాక జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరిస్తామని కేంద్రం గతేడాది హామీ ఇచ్చింది. ఈ క్రమంలో నేడు కీలక సమావేశం నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి: జూలై చివరి వారంలో పది, ఇంటర్ పరీక్షలు