Tuesday, November 26, 2024

బైడెన్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు..


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో భారత్, అమెరికా దేశాల బంధం మరింత బలోపేతం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇరుదేశాల మధ్య వ్యాపార భాగస్వామ్యం మరింత పటిష్టమవ్వాలని, ఇరుదేశాల వాణిజ్య బంధానికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా మోదీ ఆదేశ అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. కొవిడ్-19పై పోరాటం సహా విస్తృత ప్రాధాన్యతా అంశాలపై శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్​లో సుమారు గంటపాటు చర్చించారు.  అనంతరం బైడెన్ తో కలిసి సంయుక్తంగా ప్రసంగించారు. బైడెన్ తో ఈ సమావేశం ఎంతో కీలకమైనదని మోదీ పేర్కొన్నారు. బైడెన్ నాయకత్వానిదే ఈ దశాబ్దంలో కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు. భారత్, అమెరికా దేశాలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని మోదీ స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ.. భారత్-అమెరికా బంధం ఎంతో కీలమైనదని తాను అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే చెప్పానని గుర్తు చేశారు. ప్రపంచంలోనే భారత్, అమెరికా అత్యంత సన్నిహిత దేశాలని చెప్పారు. ప్రపంచ సవాళ్లకు భారత్-అమెరికా బంధం పరిష్కారం చూపాలని పేర్కొన్నారు.

కాగా, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికైన తర్వాత ఆయనతో భారత ప్రధాని మోదీ ద్వైపాక్షిక భేటీ కావడం ఇదే తొలిసారి. శ్వేతసౌధంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. జో బైడెన్‌ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తొలిసారి జరిగిన ఈ ద్వైపాక్షిక భేటీలో కరోనాపై పోరాటం, వాతావరణ మార్పులు, ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంపై కీలకంగా చర్చించారు. అలాగే, అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చించినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement