ప్రధాని నరేంద్ర మోదీ వినియోగించే వాహనాల్లో కొత్త కారు వచ్చింది. గత కొన్నేళ్లగా రేంజ్ రోవర్ వోగే, టయోటా ల్యాండ్ క్రూయిజర్ మోడళ్లను ప్రధాని మోదీ వినియోగించారు. అయితే, తాజాగా మెర్సిడెజ్ మే బాక్ ఎస్ 650 కారును వినియోగిస్తున్నారు. ఈ కారు ఖరీదు సుమారు రూ.12 కోట్లు.
ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు స్వాగతం పలుకుతూ హైదరాబాద్ హౌస్‌లో కొత్త మేబ్యాక్ 650 ఆర్మర్డ్ కారులో మోదీ కనిపించారు. తాజాగా మోడీ కాన్వాయ్‌లో ఈ వాహనం మరోసారి ప్రత్యక్షమైంది. ఈ కొత్త కారు రక్షణ పరంగా చాలా పటిష్ఠమైనది. బుల్లెట్ల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా, పేలుడు పదార్థాల నుంచి రక్షణ కల్పించే సామర్థ్యం కూడా ఉంది. ఎక్స్ ప్లోజివ్ రెసిస్టెంట్ వెహికల్ (ఈఆర్వీ) 2010 రేటింగ్ దీనికి ఉంది. రెండు మీటర్ల దూరంలో 15 కిలోల టీఎన్ టీ పేలుడు జరిగినా కారులోని వారికి ఏమీ కానంత బలంగా దీన్ని తయారు చేశారు. ఒకవేళ గ్యాస్ దాడి జరిగితే కారు క్యాబిన్ నుంచి ప్రత్యేకంగా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా ఏర్పాటు ఉంది. పేలుడు వంటి దాడి కారణంగా దెబ్బతిన్నా కానీ పనిచేసేలా ఫ్లాట్ టైర్లు ఏర్పాటు చేశారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు.
ప్రధాని రక్షణ బాధ్యతలు ఎస్పీజీ చూస్తుంటుంది. ప్రధాని కాన్వాయ్ లో ఒకే మాదిరి రెండు కార్లు ఉంటాయి. భద్రత రీత్యా ప్రధాని ఏ కారులో ప్రయాణిస్తారన్నది గోప్యంగా ఉంచుతారు. కాగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ బుల్లెట్ ప్రూఫ్ మహీంద్రా స్కార్పియోని వినియోగించారు. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మోదీ BMW 7 సిరీస్ హై-సెక్యూరిటీ ఎడిషన్‌ను ఉపయోగించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital