Saturday, November 23, 2024

పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ – నేడు ముఖ్య‌మైన రోజు – ప్ర‌ధాని మోడీ

నేటి నుండి ఇండియాలో 12-14ఏళ్ల పిల్ల‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్ వేసే కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌యింది. కాగా భార‌త‌దేశంలో నేడు ముఖ్య‌మైన రోజ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలిపారు. 60 ఏళ్ల పైబడిన వారందరికీ ప్రికాషన్ డోసులు వేయడం మొదలుపెట్టామని చెప్పారు. భారత వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా శాస్త్రీయమైనదని చెప్పారు. ప్రజలను కాపాడేందుకు, మహమ్మారిపై పోరును ఉద్ధృతం చేసేందుకు 2020లోనే వ్యాక్సిన్ల తయారీపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారని ఆయన అన్నారు. కష్టకాలంలో శాస్త్రవేత్తలు, ప్రైవేట్ కంపెనీలు చాలా బాగా పనిచేశారని కొనియాడారు. వ్యాక్సిన్ తయారీ తొలినాళ్లలో తాను మూడు సంస్థలను పరిశీలించానని, వారు వ్యాక్సిన్ ను ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకోగలిగానని తెలిపారు. 2021 జనవరిలో వైద్యులు, వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ను మొదలుపెట్టామని గుర్తు చేశారు. కరోనా పోరులో ముందున్న వారికి రక్షణ ఉండాలన్న ఉద్దేశంతోనే ముందుగా వారికి కరోనా టీకాలను ఇచ్చామన్నారు. ఆ తర్వాత అదే ఏడాది మార్చిలో 60 ఏళ్లుపైబడినవారికి, 45 ఏళ్లు నిండి ఇతర వ్యాధులున్నవారికి టీకాలను ఇవ్వడం ప్రారంభించామని ప్రధాని గుర్తు చేశారు. ఆ తర్వాత 18 ఏళ్లు నిండినవారందరికీ వ్యాక్సిన్ వేయడం షురూ చేశామని చెప్పారు. అలా దశలవారీగా ఇప్పటి వరకు 180 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను ప్రజలకు అందించామని చెప్పారు.

15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు 9 కోట్ల డోసులు వేశామని, మరో 2 కోట్ల ప్రికాషనరీ డోసులను వృద్ధులు, 55 ఏళ్లు నిండి ఇతర వ్యాధులున్నవారికి ఇచ్చామని పేర్కొన్నారు. మిగతా దేశాల్లో చాలా మంది వ్యాక్సిన్లు వేసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటే.. మన దేశంలో మాత్రం అందరూ ముందుకు వచ్చారని, అందరూ టీకా తీసుకోవాలని ఎదుటి వారిని ప్రోత్సహించారని మోదీ గుర్తు చేశారు. అది చూసి తన మనసు ఉప్పొంగిపోయిందని అన్నారు. దేశ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాల కృషి అభినందనీయమన్నారు. పర్యాటకం ఎంతో ముఖ్యమైన హిమాలయ రాష్ట్రాలు వ్యాక్సినేషన్ లో ముందు నిలిచాయన్నారు. ప్రపంచమంతా బాగుండాలన్న భారత విలువలను దృష్టిలో పెట్టుకుని ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాలకూ వ్యాక్సిన్లను పంపించామని మోదీ చెప్పారు. భారత వ్యాక్సినేషన్ ప్రయత్నాలు.. కరోనాపై ప్రపంచ పోరును మరింత దృఢం చేశాయన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement