Tuesday, November 26, 2024

అమెరికాకు ప్రధాని మోదీ.. టూర్ షెడ్యూల్ ఇది..

అమెరికాలో నాలుగు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ  బ‌య‌లుదేరి వెళ్లారు. తొలిసారి నేరుగా నిర్వహిస్తోన్న క్వాడ్​ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. క్వాడ్​ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి 76 వార్షిక సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తోనూ ప్రధాని భేటీ కానున్నారు.  ఈ నెల 25 వరకు అమెరికాలో మోదీ పర్యటన కొనసాగనుంది.

అమెరికా పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఆహ్వానం మేర‌కు తాను ఆ దేశానికి వెళ్తున్న‌ట్లు తెలిపారు. ఈ పర్యటనలో భారత్​- అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో సమీక్షించనున్నట్లు తెలిపారు. పరస్పర ప్రయోజనం ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించనున్నట్లు మోదీ వెల్లడించారు.

అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యొషిహిదె సుగాలతో కలిసి తొలిసారి ప్రత్యక్షంగా జరగనున్న క్వాడ్​ సమ్మిట్‌లో పాల్గొంటానని తెలిపారు. అలాగే ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో ఉగ్రవాదంపై పోరు, వాతవారణ మార్పులు సహా పలు అంశాలపై ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement