Tuesday, November 26, 2024

కేసీఆర్ ఆలోచనలు అమలు చేస్తామన్న మోదీ…

తెలంగాణకు అధిక సంఖ్యలో ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని ప్రధాని మోదీకి సీఎం కెసిఆర్ విజ్జప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆదివారం ప్రగతిభవన్ లో సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులపై కేంద్రమంత్రి హర్షవర్థన్‌తో పోన్లో మాట్లాడారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు. అయితే సీఎం కేసిఆర్‌ తో ఫోన్లో మాట్లాడిన హర్షవర్థన్ ప్రధానితో చర్చిస్తానని చెప్పారు. ఈనేపథ్యంలోనే ప్రధాని మోడీ వెంటనే స్పందించారు.

సమీక్షా సమావేశానంతరం సీఎం కేసీఆర్ తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోను లో మాట్లాడారు. సమీక్ష సందర్భంగా సీఎం చేసిన సూచనలను కేంద్ర మంత్రి హర్షవర్దన్ తనకు వివరించారని ప్రధాని సీఎం కేసీఆర్ కు తెలిపారు. ‘‘ మీది మంచి ఆలోచన, మీ సూచనలు చాలా బాగున్నాయి. వాటిని తప్పకుండా ఆచరణలో పెడుతాం..మీ సూచనలకు అభినందనలు’ అంటూ ప్రధాని సీఎం కేసీఆర్ ను అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మరింతగా ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని సీఎం ప్రధానికి విజ్జప్తి చేశారు. సిఎం చేసిన విజ్జప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. అందుకు సంబంధించి సత్వరమే చర్యలు చేపడతామని సీఎం కేసీఆర్ కు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement