భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులపాటు ఐరోపాలో పర్యటించనున్నారు. ఆదివారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి జర్మనీ బయలుదేరారు. జర్మనీతోపాటు ఫ్రాన్స్, డెన్మార్క్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షాల్జ్‌తో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్, డెన్మార్క్ ప్రధాని మెటె ఫెడరిక్సన్‌తో భేటీ అవుతారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక, రక్షణ సంబంధాలను గురించి చర్చించనున్నారు.
డెన్మార్క్‌లోని కోపెన్‌హేగన్‌లో జరుగనున్న భారత్-నార్డిక్ సదస్సులో డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే దేశాధినేతలతో భేటీ అవుతారు. మొత్తంగా ప్రధాని మోదీ తన మూడు పర్యటనలో భాగంగా 25 సమావేశాల్లో పాల్గొంటారు. ఏడు దేశాలకు చెందిన ఎనిమిది మంది ప్రపంచ నేతలతోపాటు 50 మంది అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ప్రధాని మోదీ యూరప్‌లో పర్యటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. రష్యా చర్యలను బహిరంగంగా ఖండించడానికి భారతదేశం విముఖత చూపించన సంగతి తెలిసిందే.