పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు భగవంత్ మాన్ ఈరోజు ప్రమాణస్వీకారం చేయగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పంజాబ్ కోసం కలిసి పని చేద్దామని చెప్పారు. ‘‘పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు శ్రీ @భగవంత్ మాన్ జీకి అభినందనలు. పంజాబ్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేస్తాం” అని ప్రధాని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. పంజాబ్‌లోని షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలోని లెజెండరీ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్‌లో జరిగిన గ్రాండ్ వేడుకలో మాన్ ఇవ్వాల పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
వేడుక అనంతరం పంజాబ్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని పీడిస్తున్న నిరుద్యోగం, అవినీతి, రైతుల కష్టాలు వంటి సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్, పసుపు తలపాగాలు ధరించిన ఇతర నేతలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇటీవల ముగిసిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో AAP అఖండ విజయాన్ని నమోదు చేసింది. 92 స్థానాలను గెలుచుకుంది. 117 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 18 సీట్లు గెలుచుకుంది. సంగ్రూర్ జిల్లాలోని ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భగవంత్ మాన్ కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై 58,206 ఓట్ల తేడాతో గెలుపొందారు.