Friday, November 22, 2024

2K Notes | ఆ నిర్ణయం బ్లాక్​ మనీని ప్రోత్సహించేలా ఉంది.. సుప్రీంకోర్టులో పిల్​ దాఖలు

రెండు వేల నోట్లను చలామణిలో లేకుండా చేసేందుకు ఆర్​బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆక్షేపిస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్​) దాఖలైంది. ఈ నిర్ణయం బ్లాక్​ మనీని ప్రోత్సహించేలా ఉందని, అవినీతికి ఆస్కారం కలిగే చాన్స్​ ఎక్కువగా ఉందని ఫిర్యాదు దారు పిటిషన్​లో పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిల్​ని ఆ కోర్టు కొట్టేసింది. దీంతో ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2,000 నోట్లను మార్చుకునేందుకు వీలు కల్పించిన నోటిఫికేషన్‌లను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్) ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. అయితే.. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. 2,000 కరెన్సీ నోట్లు బ్యాంకు ఖాతాల్లో మాత్రమే జమ అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ, ఎస్‌బీఐలకు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌లో కోరారు.

మే 19, 20 తేదీలలో ఆర్‌బీఐ ఇచ్చిన నోటిఫికేషన్‌ అక్రమ డబ్బును చట్టబద్ధం చేయడానికి బహిరంగ అవకాశాన్ని కల్పించినట్టు అవుతుందని, బ్లాక్​ మనీ, అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి ఉద్దేశించిన వివిధ చట్టాల లక్ష్యాలకు ఇది పూర్తిగా విరుద్ధమని అడ్వకేట్​ ఉపాధ్యాయ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బ్లాక్ మనీ హోల్డర్లను గుర్తించడం ఆర్‌బీఐ విధి అని, వారి నల్లధనాన్ని చట్టబద్ధం చేయడానికి చట్టపరమైన మార్గాలను అందించవద్దని పేర్కొన్నారు.

- Advertisement -

ఇక.. ఉపాధ్యాయ్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు.. రూ. 2000 నోట్లను ఉపసంహరించుకోవడం డీమోనిటైజేషన్ కేసు కాదని, రూ. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకునే ప్రక్రియలో భాగమేనని పేర్కొంది. ఈ ప్రయోజనం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కోర్టు పేర్కొంది. రూ.2000 డినామినేషన్ల బ్యాంక్ నోట్లను మార్చుకోవడానికి చాన్స్​ కల్పించారని, తద్వారా ప్రతి ఒక్కరూ ఇతర నోట్లతో వాటిని బ్యాంకుల వద్ద మార్చుకోవచ్చు. కాబట్టి, ప్రభుత్వ నిర్ణయం తప్పుగా లేదని, ఏకపక్షంగా కూడా లేదని, లేదా నల్లధనం, మనీలాండరింగ్, లాభార్జనను ప్రోత్సహిస్తుందని.. లేదా అవినీతికి దోహదపడుతుందని చెప్పలేము” అని ఉపాధ్యాయ్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఢిల్లీ హైకోర్టు తీర్పులో పేర్కొంది. కాగా, 2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవాలని ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయవాది రజనీష్ భాస్కర్ గుప్తా దాఖలు చేసిన మరో పిల్‌ను కూడా ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement