చైనాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 132 మందితో ప్రయాణిస్తున్న బోయింగ్ 737 విమానం గ్వాంగ్‌ఝౌ పాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1.11 గంటల ప్రాంతంలో కున్మింగ్ నగరం నుంచి గ్వాంగ్‌ఝౌ నగరానికి బయల్దేరిన చైనా ఈస్ట్రన్ సంస్థకు చెందిన బోయింగ్ విమానం మధ్యాహ్నం 2.22 గంటల సమయంలో రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది. ఆ సమయంలో విమానం 3225 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వద్ద రికార్డయింది. ఆ వెంటనే వుజౌ నగర సమీపంలో ఓ పర్వతాన్ని ఢీకొట్టి నేలకూలింది. విమానం కూలిన ప్రాంతంలో భారీగా మంటలు, దట్టమైన పొగలు ఎగసిపడినట్లు వీడియో క్లిప్పింగ్‌లలో కనిపించింది. కాగా విమానంలోని ప్రయాణికుల బంధువుల కోసం హాట్‌లైన్‌ను అందించామని, ఘటనా స్థలికి వర్కింగ్ గ్రూప్‌ను పంపామని ఎయిర్‌లైన్స్ తెలిపింది. విమానం పూర్తిగా శిథిలమైందని, ఘటనా స్థలంలోని వెదురుచెట్లకు మంటలు వ్యాపించాయని రెస్క్యూ అధికారిని ఉటంకిస్తూ మీడియా పేర్కొంది. శిథిలాల మధ్య ఎవరూ సజీవంగా ఉన్న దాఖలాలు లేవని పీపుల్స్ డైలీ తెలిపింది. పర్వతాన్ని ఢీకొనడానికి ముందు విమానం తల్లకిందులుగా వేగంగా కిందకు దూసుకువచ్చింది. దీన్ని బట్టి విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తివుండవచ్చని, అందువల్లే కుప్పకూలిందని ఏవియేషషన్ అధికారులు భావిస్తున్నారు.
అంతా 3 నిముషాల్లోనే..
విమానం కున్మింగ్ నుంచి మధ్యాహ్నం 1.11 గంటలకు బయల్దేరింది. 3.05 గంటలకు గ్వాంగ్‌జౌ చేరాల్సి ఉంది. ప్రమాదానికి ముందు 2.20 గంటల సమయంలో 29,100 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం కేవలం 2.15 నిముషాల వ్యవధిలో 9075 అడుగులకు దిగజారింది. తర్వాతి 20 సెకన్లలో 3225 అడుగులకు చేరింది. విమానం 31వేల అడుగల ఎత్తునుంచి 350 మైళ్ల వేగంతో నిట్టనిలువుగా కుప్పకూలినట్లు ఫ్లైట్ రాడార్ 24 తెలిపింది. వాతావరణ డేటా ప్రకారం, వుజౌలో మంచి దృశ్యమానతతో ఆకాశం పాక్షికంగా మేఘావృత మైనట్లు వెల్లడైంది. వీలైనంత త్వరగా ప్రమాదానికి గల కారణాన్ని గుర్తించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశించారు. కాగా, ప్రభుత్వ యాజమాన్యంలోని చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ సీట్ సామర్థ్యం ప్రకారం ప్రపంచంలోనే ఆరవ అతిపెద్దది. భద్రతపరంగా చైనా ఏవియేషన్ రికార్డు గత దశాబ్దంలో ప్రపంచంలోనే అత్యుత్తమమైంది. పైగా సోమవారం క్రాష్ అయిన 737-800 మోడల్ మంచి సేఫ్టీ రికార్డును కలిగివుంది.
చైనాలో ఘోర విమాన ప్రమాదాలు..
- 1994లో నార్త్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ టుపోలెవ్ టియు-ఎల్ 54 జియాన్ నుంచి గ్వాంగ్‌జౌకి వెళ్తూ ప్రమాదానికి గురైంది. విమానంలోని 160 మంది మృత్యువాతపడ్డారు.
- 2004లో షాంఘైకి వెళ్తున్న విమానం ఇన్నర్ మంగోలియాలో కూలింది. ఈ ప్రమాదంలో 53 మంది మరణించారు.
- 2010లో హెనాన్ ఎయిర్‌లైన్స్ కో ఎంబ్రేయర్ జెట్ ప్రమాదానికి గురైంది. ఇందులోని 96 మంది ప్రయాణికుల్లో 44 మంది మరణించారు.
- 2013లో షాంఘై విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న వేళ ఎంబ్రేయర్ ఎస్‌ఎ జెట్ రన్‌వే నుంచి జారింది. చైనా ఈస్టర్న్‌లో ఇదే చివరి అతిపెద్ద ప్రమాదం.
- గత నాలుగేళ్లలో 2018 ఇండోనేషియా, 2019 ఇథియోపియా విమాన ప్రమాదాల తర్వాత ఇదే అతిపెద్ద విమాన ప్రమాదం.
బోయింగ్ 737 ప్రమాదాలు..
– 2006: గోల్‌ట్రాన్స్‌పోర్టెస్ ఏరియోస్ విమానం బ్రెజిల్‌లో కుప్పకూలింది. 154 మంది మరణించారు.
– 2007: కెన్యా ఎయిర్‌వేస్ విమానం నైరోబికి వెళ్లే మార్గంలో బురదలో కూలింది. 108 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
– 2009: ఇస్తాంబుల్ నుంచి టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం ఆమ్‌స్టర్‌డ్యామ్‌లోని పిపోల్ వద్ద పొలాల్లో కూలింది. 9 మంది మరణించారు.
– 2010: ఇథియోపియా ఎయిర్‌లైన్స్ విమానం బీరుట్ నుంచి బయల్దేరిన తర్వాత మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. 90 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది మృతిచెందారు.
– 2010: ఎయిరిండియా విమానం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ముందు రన్‌వే నుంచి పక్కకు దూసుకెల్లింది. 158 మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది మరణించారు. 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
-2016: దుబాయ్ నుంచి రష్యాలోని రోస్టోవ్-ఆన్-డాన్ వెల్లే ప్లై దుబాయ్ విమానం కూలిపోయింది. 62 మంది మరణించారు.
– 2018: మైక్రోనేషియాలోని పోన్‌పే నుంచి ఎయిర్ నియుగిని ఫ్లైట్ చుక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లి మడుగులో దూకింది. ఒక వ్యక్తి మరణించాడు.
2020: పెగాసస్ ఎయిర్‌లైన్స్ విమానం ఇస్తాంబుల్ సబిహాగోకెన్ ఎయిర్‌పోర్టు రన్‌వే నుంచి జారింది. మూడు ముక్కులుగా విడిపోయింది. ముగ్గురు మరణించారు.
2020: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం భారీ వర్షంలో ల్యాండ్ అవుతుండగా కలకత్తా ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి పక్కకుజారి కొండగట్టును ఢీకొట్టింది. పైలట్లు సహా 18 మంది మరణించారు.
2022: చైనా ఈస్టర్న్ విమానం గ్వాంగ్‌ర&°కు వెళ్తూ ప్రమాదానికి గురైంది. 132 మంది మృతిచెందారు.