కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసేందుకు ప్రశాంత్ కిశోర్ సిద్ధమయ్యారు. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేసేందుకు ప్రశాంత్ కిశోర్ అంగీకారం తెలిపినట్లు పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి అనుబంధం లేకుండా కేవలం ఓ ప్రొఫెషనల్‌గా పని చేసేందుకు ప్రశాంత్ కిశోర్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీతో సమావేశమైన సందర్భంగా ఈ మేరకు అంగీకారం తెలిపినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఫలితాలను చవిచూసింది. యూపీలో కేవలం రెండు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి రాగా, అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ల్లోనూ ఆశించిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీ సాధించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీడబ్ల్యూసీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కోర్ కమిటీ కూడా సమాలోచనలు జరిపింది. అటు జీ-23 నేతలు గాంధీ కుటుంబంపై విమర్శనాస్త్రాలు సంధించారు. నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ కూడా చేశారు.
ఇదిలా ఉండగా… గుజరాత్ కాంగ్రెస్ నేతలతో రానున్న అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై ఇటీవల రాహుల్‌గాంధీ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కౌరవులు ఉన్నారు… వారిని గుర్తించి బయటకు పంపితే పార్టీ బాగుపడుతుందని రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గుజరాత్ కాంగ్రెస్ నేతలు ప్రశాంత్ కిశోర్ ప్రస్తావన తీసుకువచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్ సేవలు వినియోగించుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో తుది నిర్ణయం రాహుల్‌గాంధీకే విడిచిపెట్టినట్లు గుజరాత్ పీసీసీ నేత ఒకరు తెలిపారు.
రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వ మార్పుపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు మినహా కమిటీ, అన్ని జిల్లాల కమిటీలను రద్దు చేసింది. 25 మంది ఉపాధ్యక్షులు, 75మంది ప్రధాన కార్యదర్శులతో పీసీసీ నూతన కమిటీని నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మరికొద్ది మాసాల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ మార్పు తీసుకున్నట్లు గుజరాత్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి రఘు శర్మ తెలిపారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలు వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదని గుజరాత్ పీసీసీ నేతలు చెబుతున్నారు.
హర్యానా నేతలతో రాహుల్‌గాంధీ భేటీ..
హర్యానాలో తాజా రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా, పీసీసీ అధ్యక్షురాలు కుమారి షెల్జా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కులదీప్ బిష్ణోయ్, కిరణ్ చౌదరి, రాజ్యసభ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా, కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ తదితరులు ఉన్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. గ్యాస్, పెట్రో ధరలు పెంపుదలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పీసీసీ నేతలకు రాహుల్‌గాంధీ సూచించారు.