పెట్ డాగ్ లవర్స్‌కి ఇది కాస్త బాధాకరమైన వార్త.. ప్రేమగా పెంచుకున్న ఓ పెంపుడు కుక్క దాడి చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ మహిళ చనిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మృతురాలి కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు ఒక రిటైర్డ్ టీచర్, ఆమె కొడుకు -జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి రెండు పెంపుడు కుక్కలున్నాయి. వీరు లక్నోలోని కైసర్‌బాగ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అతని వద్ద ఇంతకుముందే ఒక లాబ్రడార్ ఉండేది. అయితే.. తన స్నేహితుడి నుంచి మరో పిట్‌బుల్ ని మూడేళ్ల క్రితం అడాప్ట్ చేసుకున్నాడు.
కాగా, మృతురాలి కొడుకు అమిత్ తన తన దగ్గరి బంధువు దగ్గరి నుంచే దీన్ని దత్తత తీసుకున్నాడు. అయితే.. తను ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించేందుకు నిరాకరించాడు. దాన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు లక్నో పౌర సంఘం నుంచి అన్ని చట్టపరమైన పత్రాలు, ఫార్మాలిటీలను పూర్తి చేశాడు. అయితే.. చాలా రోజుల నుంచి బాగానే ఉన్న పిట్‌బుల్ ఈ మధ్య దాని ప్రవర్తనలో తేడా వచ్చిందని, ఉన్నట్టుండి తన తల్లిపై అటాక్ చేసినట్టు చెప్పాడు.
కాగా, అమిత్ తల్లిపై పిట్‌బుల్ దాడి చేసిన తర్వాత లక్నో మునిసిపల్ కార్పొరేషన్ ఆ కుక్కను నాగర్ నిగమ్ జంతు జనన నియంత్రణ కేంద్రానికి తరలించింది. అక్కడ దాని ప్రవర్తనను పరిశీలన చేశారు. అయితే.. తల్లి మరణించిన బాధలో ఉన్న అమిత్, ఆ కుక్కను తిరిగి దాని మొదటి యజమానికి అప్పగించినట్టు సమాచారం. అది ఎందుకలా అటాక్ చేసి చంపేసిందనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదని కన్నీరుమున్నీరయ్యాడు అమిత్.