వాట్సాప్ ఏం రంగులో ఉంటుంది అంటే… ఆకుపచ్చ రంగులో ఠక్కున సమాధానం వచ్చేస్తుంది. అయితే కొన్నిసార్లు కొత్త రంగులో వాట్సాప్ వస్తోంది, వచ్చేసింది అంటూ కొన్ని లింక్‌లు కనిపిస్తూ ఉంటాయి. అవి నిజం కావు, వాట్సాప్‌కి వాటికీ సంబంధం లేదని గతంలో చాలామంది టెక్ నిపుణులు హెచ్చరించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… మరో ఫేక్ లింక్ ఇప్పుడు వాట్సాప్‌లో వైరల్ అవుతోంది కాబట్టి.. ఫేక్ వాట్సాప్ లింక్‌లు మీకు కూడా గతంలో వచ్చుంటాయి. వాటిని క్లిక్ చేసి కొంతమంది ఇబ్బందులు పడి ఉంటారు. అలాంటి ఓ లింక్ ఇప్పుడు మళ్లీ కనిపిస్తోంది. ‘పింక్ వాట్సాప్’ (Pink Whatsapp) అంటూ ఓ లింక్ వైరల్ అవుతోంది.
అది అచ్చంగా వాట్సాప్ లింక్ లానే ఉంటుంది కానీ, వాట్సాప్‌కీ, దీనికీ సంబంధం ఏమీ ఉండదు. ఆ లింక్‌ను క్లిక్ చేస్తే మీ సమాచారం మొత్తం అగంతుకుల చేతికి చేరిపోతుంది. కొత్త తరహా లింకే ఇప్పుడు వాట్సప్ లలో సర్క్యులేట్ అవుతోంది. ఇది క్లిక్ చేస్తే వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు మీకు అందుబాటులోకి వస్తాయని కూడా రాశారు. మీకు కూడా అలాంటి లింకు వచ్చి ఉంటే పొరపాటున కూడా క్లిక్ చేయొద్దు అసలు కొత్త వాట్సాప్ అంటూ ఏదైనా వస్తే ప్లే స్టోర్ ద్వారానే వినియోగదారులకు అందిస్తుంది. ప్లే స్టోర్ లో యాప్ అప్డేట్ చేసుకుంటే మీకు వాట్స్అప్ అందించే కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఫేక్ లింకును ఇప్పటికే క్లిక్ చేసి ఉంటే వెంటనే మీ ఫోన్ ను రీసెట్ చేయండి. దానికోసం మొబైల్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లండి. అందులో సిస్టం ఆప్షన్‌లోకి వెళ్తే రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే (Erase All Data) ఆప్షన్ వస్తుంది. దీని క్లిక్ చేసి మొబైల్ రీసెట్ చెయ్యొచ్చు. దీంతోపాటు మీ మెయిల్ ఐడి బ్యాంకు ఖాతాలు, సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డ్ లు మార్చుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.