సీఎం కేసీఆర్ ఇవ్వాల (మంగళవారం) నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం, జిల్లా ఎస్పీ ఆఫీస్ తో పాటు, బీఆర్ఎస్ పార్టీ భవనాలకు సీఎం ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాల పర్యటనలతో మరింత ఆసక్తి నెలకొంది.
ఇక.. నాగర్‌కర్నూల్‌లో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ప్రారంభం సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీగా జన సమీకరణ చేయనున్నట్టు తెలుస్తోంది. వారం రోజులగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
కాగా, కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించేందుకు ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ తమ తమ నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో జనాన్ని సమీకరించేలా ఏర్పాట్లు చేశారు. సీఎం వస్తుండటంతో జిల్లా కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు, బ్యానర్లతో నాగర్‌కర్నూల్, ఆ రూట్‌లో ఉన్న పట్టణాలు, పల్లెలన్నీ గులాబీ మయం అయ్యాయి.