Friday, November 22, 2024

Top Stroy : గులాబీ కోటకు….ట్యాపింగ్‌ మరక

- Advertisement -

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సంచలనం సృషించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుల వాంగ్మూలాలు గులాబీ కోటవైపే చూపిస్తున్నాయి. ట్యాపింగ్‌ వ్యవహారంలో గులాబీ నేతల పేర్లు వినిపిస్తుండటంతో గులాబీ ట్యాపింగ్‌ మరకలు అంటుకుంటు న్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు మాజీ డీసీపీ రాధాకిషన్‌, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావులతో పాటు ఇతర నిందితులు అప్పటి ప్రభుత్వం పెద్దల ఆదేశాల మేరకే ట్యాపింగ్‌ చేశామని వాంగ్మూలాలు ఇచ్చారు. మరొకొందరు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ఆదేశాలతో ట్యాపింగ్‌ తతంగం జరిగిందని విచారణలో వెల్లడించారు.

కాగా ఓ రాజకీయ పార్టీకి ఇంతలా గులాంగిరీ చేసిన పోలీసు అధికారుల తీరుపై అటు పోలీసుశాఖ ఇటు ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ నేతలు మండిపడుతున్నారు. గులాబీ కోటకు నలుదిక్కులా నలుగురు మాజీ అదనపు ఎస్‌పీ కాపలా కాసి ప్రతిపక్షాలను వెంటాడిన తీరుపై అటు న్యాయ నిపుణులు, ఇటు పోలీసు ఉన్నతాధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. ట్యాపింగ్‌ ద్వారా ప్రతిపక్షాల రహస్యాలను చాటుగా విని వాటిని అధికార పార్టీకి చేరవేసిన పోలీసు దండుపై నేడు అధికారంలో ఉన్న నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ కేసులో నిందితుల వెనుక ఉన్న పెద్దలను వెలికి తీసి కఠినంగా శిక్షించాలని బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు మూకుమ్మడిగా కోరుతున్నారు. నాటి అధికార పార్టీ కుట్రలకు పావులుగా పనిచేసిన పోలీసుల తీరును అసహ్యించుకుంటున్నారు. కుట్రల వెనుక బడా నేతలను కటకటాల పాలుచేయాలని నేతలు డీజీపీకి కార్యాలయానికి క్యూ కడుతున్నారు.

ఈ కేసు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పదుల సంఖ్యలో బాధిత నేతలు తమకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా వెళ్లబోసుకుంటున్నారు. దీంతో నిక్కచ్చిగా విధులు నిర్వహించాల్సిన ఖాకీలు ఖద్దరు రంగు పూసుకుని కుట్రలకు తెరతీయడంపై సామాన్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ ఎస్‌ఐబీ చీఫ్‌, మాజీ డీసీపీ, నలుగురు మాజీ ఏసీపీలతో పాటు ఇద్దరు డీఎస్‌పీలు, మరో నలుగురు సీఐలు కీలక పాత్ర వహించడంపై పోలీసుశాఖ ప్రతిష్టకు మాయని మచ్చగా మారిందని అధికారులే పేర్కొంటున్నారు.

అన్ని వర్గాలకు రక్షణ కల్పిచాంల్సిన పోలీసులు ఒకే వర్గానికి కొమ్ముకాయడంపై పోలీసు శాఖ ప్రతిష్ట మసకబారుతోందని పోలీసు ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెరసి పోలీసుశాఖలో ఉన్నతస్థాయిలో విధులు వెలగబెడుతున్న పోలీసులు ఎనిమిదేళ్ల పాటు గులాబీ కోటలో కోవర్టులుగా పనిచేయడంపై పెద్దఎత్తున చర్చ సాగుతోంది. కొందరు ఖాకీలు రాజకీయ కోవర్టులుగా మారి ఒక పార్టీని అందెలం ఎక్కించేందుకు మరొక పార్టీని అధ:పాతాళానికి తొక్కేందుకు చేసిన కుట్రలపై ప్రజలు బహిరంగంగా చర్చించు కుంటున్నారు. ఇటీవల కాలంలో చిన్నపాటి హోటల్‌ వద్ద నలుగురు గుడిగూడితే చాలు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎవరెవరెవరు జైలు వెళతారన్న చర్చసాగుతోంది. ఇందులో భాగంగా ఫలానా నేతలు జైలుకు వెళ్లడం ఖాయమని బెట్టింగ్‌లు సైతం కాస్తున్నారు. ప్రతిపక్షాలను దెబ్బ కొట్టేందుకు పోలీసులే నేరుగా రంగంలోకి దిగడం రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా తొలిసారి కావచ్చని రాజకీయ మేధావులు తేల్చిచెబుతున్నారు. వెరసి ఇదిలావుండగా గులాబీ కోటకు కాపుకాసిన ఖాకీల దండు పార్టీ బలోపేతం కోసం బెదిరింపులకు పాల్పడి వందలాది కోట్ల రూపాయాలు విరాళాలు సేకరించడం విచారకరం.

ఏకపక్షంగా ఎనిమిదేళ్లు
రాష్ట్రంలో ఏమిదేళ్ల పాటు ప్రతిపక్షాల ఫోన్‌లను ట్యాపింగ్‌ చేసినట్లు ఈ కేసులోని ఏ4 రాధాకిషన్‌ రావు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యంగా 2018 ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి డబ్బులు తరలించినట్లు- పోలీసుల ఎదుట అంగీకరించారు. అలాగే 8 సార్లు టాస్క్‌ ఫోర్స్‌ వాహనాల్లో డబ్బులు తరలించినట్లు- ఒప్పుకున్నారు. ప్రతిపక్షాలకు చెందిన కొంతమంది ప్రముఖుల ప్రొఫైళ్లను అనధికారకంగా తయారుచేసి అక్రమాలకు పాల్పడ్డా రని విచారణలో తేలింది. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి పలువురి ప్రొఫైళ్లని రాధా కిషన్‌ రావు తయారు చేశాడని, బెదిరింపులకు పాల్పడి ఒక పార్టీకి డబ్బులు చేరే విధంగా చేశాడని పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్‌కి అనుకూలంగా ఫలితాలు రావడంతో ఎస్‌ఐబీలోని హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేసిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకు రాధాకృష్ణ సహకరించాడని పోలీసులు చెబుతున్నారు. పలువురి ప్రొఫైల్స్‌కు సంబంధించిన వ్యవహారాలను బయటకు రాకుండా ఉండటానికి ఆధారాలను ధ్వంసం చేశారని వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ సైతం తెలిపారు.

ఎమ్మెల్యేల కొనుగోలు :
క్రమశిక్షణ శాఖలో పనిచేస్తూ ఒక వర్గానికే కొమ్ముకాసిన మాజీ ఎస్‌ఐబీ చీఫ్‌ అండ్‌ అదర్స్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం వల్లే ఎమ్మెల్యేల కొనుగోలు విషయం వెలుగుచూసింది. సీసీటీ-వీ కెమెరాలు, స్పై కెమెరాలు, వాయిస్‌ రికార్డర్లు, మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ డివైస్‌ను రాధకిషన్‌ రావు ఏర్పాటు- చేసినట్లు- పోలీసులు గుర్తించారు. ఎంఎల్‌ఏ కొనుగోలు కేసులో రాధాకిషన్‌ కీలక పాత్ర వహించినట్లు విచారణలో తేలింది. ఫాంహౌస్‌ ఎపిసోడ్‌ కోసం రాధ కిషన్‌ రావు 74 డివైసులను ఏర్పాటు- చేసినట్లు- గుర్తించారు. నంద కుమార్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి ఫాంహౌస్‌ ఎపిసోడ్‌కు రాధా కిషన్‌ రావు స్కెచ్‌ వేయడంతో పాటు ఆ ప్రాంతంలో సీసీటీ-వీ కెమెరాలను ఐటీ- ఇన్‌స్పెక్టర్‌ జూపల్లి రమేష్‌ రావు మానిటరింగ్‌ చేసినట్లు- తేలింది.

ఖాకీల గులాబీ…
బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం కొందరు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు- చేసినట్లు- రాధాకిషన్‌ రావు విచారణలో అంగీకరించిన విషయం విధితమే. టాస్క్‌ఫోర్స్‌లోని సిబ్బందిని బెదిరించి బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నేతలకు నేరుగా డబ్బులను సరఫరా చేసినట్లు- అంగీకరించారు. టాస్క్‌ఫోర్స్‌ బృందానికి వాహనాలు సమకూర్చినట్లు- ఒప్పుకున్నారు. ఓ ఎమ్మెల్సీ చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతడి డబ్బులు తరలించినట్లు- మాజీ డీసీపీ పేర్కొన్నారు. ఈక్రమంలో 2023లో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది డబ్బుల పట్టు-కోవడంలో కీలక పాత్ర వహించి నట్లు- వెల్లడించారు. ఎన్నికల సమయంలో 8 సార్లు పట్టు-కున్న డబ్బు మొత్తం ప్రతిపక్షాలకు చెందినదేనని విచారణలో నిందితులు చెప్పారు. 2018లో శేరిలింగంపల్లి టీ-డీపీ అభ్యర్థి భవ్య సిమెంట్‌ ఆనంద్‌ ప్రసాద్‌ నగదు ప్యారడైజ్‌ వద్ద రూ.70 లక్షలు సీజ్‌ చేసినట్లు- తెలిపారు. 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునంధన్‌ రావు, ఆయన బందువుల నుంచి రూ.కోటి సీజ్‌ చేసినట్లు- పేర్కొ న్నారు. ముడుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సహచరుల నుంచి రూ.3.50 కోట్ల స్వాధీనం చేసుకున్నామని రాధాకిషన్‌ రావు చెప్పినట్లు- రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

చక్రం తిప్పిన మాజీ చీఫ్‌…
ఈ కేసులో మాజీ ఎస్‌ఐబీ చీఫ్‌ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. బీఆర్‌ఎస్‌ విజయం కోసం ప్రభాకర్‌ రావు సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్‌ చేశారు. ఈకేసులో కీలక నిందితులు రాధాకిషన్‌రావుతో పాటు- భుజంగరావు, తిరుపతన్నలు సైతం ఈ విషయాన్ని అంగీకరించారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే తాము ట్యాపింగ్‌కు పాల్పడినట్లు తేల్చిచెప్పారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావుతో ఆదేశాల మేరకు ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులతో పాటు- వ్యాపారుల ఫోన్లూ ట్యాప్‌ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఈ రకమైన ఆదేశాలు ఎవరు ఇచ్చారు? గుర్తించిన వివరాలను తొలుత ఆ వ్యక్తులకు చెప్పేవారా? అనే కోణాల్లో సిట్‌ ప్రశ్నించి కీలక ఆధారాలు సేకరించింది.
కోట్ల రూపాయల కప్పం…
గులాబీ కోటలో పాలేరు పనిచేసిన పోలీసులు రాష్ట్రంలో రియాల్టర్లను, వ్యాపారులను, హవాల దందా వారిని వేధింపులకు గురిచేసి వివిధ రూపాల్లో విరాళాలు సేకరించారు. ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావు బృందం వేధింపుల తాళలేక కోటకు కప్పం కట్టిన వాళ్లల్లో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు- హవాలా వ్యాపారులూ ఉన్నట్టు- సిట్‌ గుర్తించింది. పార్టీకీ విరాళాలు సేకరించిన నిందితులను ప్రశ్నించిన సిట్‌ అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించారని తెలిసింది. విరాళాల సేకరణపై దాదాపు ఎనిమిదిగంటల పాటు- రాధాకిషన్‌రావుతో కలిపి గట్టు-మల్లును ప్రశ్నించిన సిట్‌ ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో పనిచేసిన అనేక మంది అధికారులు, సిబ్బందినీ సిట్‌ విచారిస్తూ వారి నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 47మంది నుంచి స్టేట్‌మెంట్స్‌ రికార్డు చేశారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement