Saturday, November 23, 2024

వాహ‌న‌దారుల‌కు చుక్క‌లు చూపిస్తున్న‘పెట్రో’ ధ‌ర‌లు

వ‌రుస‌గా నాలుగైదు రోజుల నుంచి పెట్రోలు, డీజిల్‌ ధ‌ర‌లు రోజూ పెరుగుతున్నాయి. ప్రజలు గ‌గ్గోలు పెడుతున్నా.. విపక్షాలు మండిపడుతున్నా.. కేంద్ర‌, రాష్ట్ర‌ ప్రభుత్వాలు మాత్రం అస్సలు ప‌ట్టించుకోవ‌డం లేదు. ధరలను తగ్గించే విష‌యంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అయితే.. చమురు కంపెనీలు మాత్రం రోజు రోజుకూ ధరల మోత మోగిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను నిత్యం పెంచుతున్నాయి.

తాజాగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. శనివారం లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంచాయి చ‌మురు కంపెనీలు. గతంలో పది పది పైసలు పెంచిన కంపెనీలు కాస్త‌.. ఇప్పుడు రోజూ 30పైసలపైనే పెంచుతున్నాయి. అంటే ప్రతి మూడు రోజులకోసారి ఇంధన ధరలు రూపాయి పెరుగుతున్నాయన్నమాట.

తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.73కి చేరింది. డీజిల్ కూడా ఇప్పటికే సెంచరీ దాటి మరింత ముందుకెళ్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ. 102.80గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.35గా, డీజిల్ ధర 102.33గా ఉంది.

ఏపీలో విశాఖపట్టణలో లీటర్ పెట్రోల్ ధర 110.99కి చేరింది. ఇక డీజిల్ రేటు 103.43గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ 112.03, డీజిల్ ధర రూ.103.88గా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ 112.04, డీజిల్ రూ.104.44 పలుకుతోంది..

పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీలో చేర్చాలని చాలా రోజులుగా డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, ఇంధన ధరలను జీఎస్టీలో చేర్చేందుకు పలు రాష్ట్రాలు అంగీకరించడం లేదని కేంద్రం తెలిపింది. ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. పెట్రోల్ రేటు రూ.75-80కి దిగొస్తుంది. అదే జరిగితే.. సామాన్య ప్రజలకు ఊరట కలుగుతుంది. కానీ, ఇది సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement