Tuesday, November 19, 2024

దేవుడి మాన్యాల‌కు త్వ‌ర‌లో రాజ‌ముద్ర‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేవుడి మాన్యాల భూము లను రెవెన్యూ రికార్డుల్లో దేవుడి పేరుతో రికార్డు చేస్తు న్నారు. మాన్యాలకు రాజముద్ర వేసి గెజిట్‌ నోటిఫై దిశగా సర్కార్‌ సమాయత్తమవుతోంది. దేవాదాయ శాఖకు చెందిన 91వేల ఎకరాల భూములను గెజిట్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటికే 20వేల ఎకరాలకు పైగా ఇందులో నమోదు చేసినట్లు సమాచారం. మరో 6వేల ఎకరాలను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. ఇలా గుర్తించిన దేవాదాయ శాఖ భూముల్లో కమర్షియల్‌ నిర్మాణాలు చేపట్టి ఆదాయం పొందే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. పలు పట్టణాల్లో ఉన్న విలువైన భూముల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకులు, వెహికిల్‌ చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సీఎం కేసీఆర్‌తో త్వరలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సమావేశమై వివరాలను నివేదించనున్నారని తెలిసింది. సీఎం ఆమోదంతో పలు కీలక నిర్ణయాలను ఆమలు చేయనున్నారు. ఇప్పటికే నగరాలు, పట్టణాల్లోని దేవాదాయ శాఖ భూముల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాల ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది. వరంగల్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లలో ఇవి నిర్మితమవుతున్నాయి.

తాజాగా సర్కార్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు మొత్తం భూముల్లో సర్వే నిర్వహించారు. 14 వేల ఎకరాలు వివాదాల్లో ఉన్నట్లు గుర్తించారు. 20వేల ఎకరాలు అర్చకుల ఆధీనంలో ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇక లీజుల పేరుతో ఇతరుల ఆధీనంలో ఉన్న 27వేల ఎకరాల ద్వారా వస్తున్న ఆదాయ వివరాలతో నివేదిక రూపొందించారు. 30వేల ఎకరాలలో ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో నమోదు చేశారు. ఆయా వివరాలను నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖలకు పంపిస్తున్నారు. తద్వారా వాటి రిజిస్ట్రేషన్లకు చెక్‌ పెట్టనున్నారు. యాజమాన్య హక్కు కాలమ్‌లో దేవుడి పేరుతోపాటు సదరు ఆలయం పేరును రాయాలని రెవెన్యూ శాఖ యోచిస్తోంది. పహాణీ, సర్వే, మంతకాబ్‌ రికార్డులలో ఆయా భూముల వివరాలను చేర్చి పకడ్బందీగా రికార్డులను నమోదు చేయనుంది.

91వేల ఎకరాలు…
రాష్ట్రంలోని 12 వేల దేవాలయాలకు దాదాపు 91 ఎకరాల భూములు ఉన్నాయని తేలింది. అయితే వీటిపై యాజమాన్య హక్కులు మాత్రం రెవెన్యూ రికార్డుల్లో దేవాదాయ శాఖ పేరుమీద లేవు. మరోవైపు కాస్రా పహాణీ, కబ్జా కాలంలో ఇతరులు పేర్లు వస్తుండటంతో న్యాయపరమైన వివాదాలు పెరిగాయి. అయితే ఈ మాన్యాలను కౌలుకు తీసుకున్న వాళ్లు, పక్కనే ఉన్న భూ యజమానులు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడ్డారు. దీంతో గత కొన్నేళ్లుగా దేవాదాయ శాఖ భూ వివాదాలు కోర్టుల్లో పేరుకుపోయాయి. రెవెన్యూ రికార్డుల్లో లెక్కలు లేకపోవడం, దేవాదాయ శాఖ వద్ద ధ్రువీకరణ పత్రాలు కనిపించకపోవడం వంటి కారణాలు ఆక్రమణదారులకు వరంగా మారాయి. ప్రధాన దేవాలయాలు మొదలుకొని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఆలయానికి ఎంతో కొంత భూములున్నాయి. కౌలు పేరుతో, పొరుగు భూమితో మరికొందరు ఆక్రమణదారులు దేవుడి భూములకు ఎసరు పెట్టారు. ఎటువంటి కఠిన చర్యలు లేకపోవడంతో యథేచ్ఛగా దేవాదాయ శాఖ భూములను కైంకర్యం చేస్తున్న వైనం తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో జోరుగా కొనసాగింది. తాజా ప్రభుత్వ చర్యలతో అక్రమాలు ఒక్కొక్కటిగా బైటకు వస్తున్నాయి. ఇదే క్రమంలో మండల, జిల్లా కేంద్రాలకు తోడు రాష్ట్ర రాజధానిలోనూ తేడా లేకుండా దెెెవుడి భూముల ఆక్రమణల పరంపర కొనసాగించారు. తాజాగా ప్రభుత్వం ప్రాథమిక సర్వేలోనే సుమారు 14,500 ఎకరాల దేవుడి భూములు పరాధీనమైనట్లుగా తేలింది. గత 15ఏళ్లుగా జరుగుతున్న అక్రమ భూ లావాదేవీల విలువ లక్షల కోట్లలో ఉన్నట్లుగా అనుమానం. నల్గొండ జిల్లాలో 3,225 ఎకరాల దేవాదాయ శాఖ భూములతోపాటు, హైదరాబాద్‌లో 2వేల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 1800 ఎకరాల దేవాదాయ భూములు పరాధీనమైనట్లుగా తేలింది. హకీంపేటలోని దేవరయాంజలలో 400 ఎకరాల దేవుడి శిఖం భూములు కబ్జా అయినట్లుగా ఇటీవలె గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement