Friday, November 22, 2024

Muslim law: యుక్త వయస్సు వస్తే చాలు, పేరెంట్స్​ పర్మిషన్​ లేకుండానే పెళ్లి.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

ముస్లిం చట్టం ప్రకారం యుక్త వయస్సు వచ్చిన మైనర్ బాలిక.. తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పెళ్లి చేసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు ఇవ్వాల (మంగళవారం) తీర్పు వెలువరించింది. అలాగే భర్తపై పోక్సో చట్టం (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం) కింద అభియోగాలు మోపబోమని పేర్కొంది. రెండు పక్షాల సమ్మతితో వివాహమైన తర్వాత లైంగిక సంపర్కం జరిగితే, ఇప్పటికీ POCSO వర్తించదని బెంచ్ పేర్కొంది. బాలిక తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందున తమకు పోలీసు రక్షణ కల్పించాలని ముస్లిం యువ జంట కోరిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ జస్మీత్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.

భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 376 (రేప్), పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద తన భర్తపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని మైనర్ అయిన బాలిక తన పిటిషన్‌లో పేర్కొంది. పెళ్లి నాటికి బాలిక వయసు 15 ఏళ్ల 5 నెలలు. ప్రస్తుతం ఆమె గర్భవతి. “పిటిషనర్లు విడిపోయినట్లయితే, అది పిటిషనర్ నెం.1 (అమ్మాయి), ఆమె పుట్టబోయే బిడ్డకు మరింత ఇబ్బంది కలిగిస్తుంది. పిటిషనర్ నెం.1 యొక్క ఉత్తమ ప్రయోజనాలను పరిరక్షించడం ఇక్కడ రాష్ట్రం ముఖ్య లక్ష్యం. పిటిషనర్ వివాహానికి ఉద్దేశపూర్వకంగా సమ్మతించి సంతోషంగా ఉంటే, పిటిషనర్ యొక్క ప్రైవేట్ స్పేస్​లోకి ప్రవేశించి జంటను వేరు చేయడానికి ఎవరికీ హక్కు లేదు. అలా చేయడం వల్ల వారి వ్యక్తిగత స్పేస్​ని ఆక్రమించినట్లే అవుతుంది” అని న్యాయమూర్తి అన్నారు.

అంతేకాకుండా జడ్జి జస్మీత్ సింగ్ పోక్సో చట్టం కింద నిందితుడిని ఉంచిన తన మునుపటి ఉత్తర్వులను వ్యతిరేకించారు. ఈ కేసులో ఆయన స్పందిస్తూ అవి రెండు వేర్వేరు కేసులని స్పష్టం చేశారు. మొదటి కేసులో నిందితుడు ఫిర్యాదుదారుడితో శారీరక సంబంధం పెట్టుకుని పెళ్లికి నిరాకరించాడు. కానీ, రెండో విషయంలో మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాతే శారీరక సంబంధం ఏర్పడింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. ముస్లిం చట్టం ప్రకారం వివాహం చేసుకున్నారు. అని జడ్జి చెప్పారు.

‘‘పార్టీలు ఒకరికొకరు భార్యాభర్తలుగా కలిసి జీవిస్తున్నారని స్టేటస్ రిపోర్ట్ కూడా స్పష్టం చేస్తోంది. వారి వివాహానికి ముందు వారు లైంగిక సంబంధం కలిగి ఉన్నారని ఎటువంటి సందేహం లేదు. నిజానికి, స్టేటస్ రిపోర్ట్ వారు 11.03.2022న వివాహం చేసుకున్నారని, ఆ తర్వాత శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నారనే విషయాన్ని సూచిస్తోంది” అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement