Tuesday, November 26, 2024

జనం తగ్గేదే లే… కోవిడ్ పరీక్షల కంటే మద్యం కొనుగోళ్లకే ప్రాధాన్యం

సాధారణ రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా సుమారు రోజుకు 61 కోట్ల మద్యం విక్రయాలు జరిగేవి. కానీ లాక్ డౌన్ అనగానే రెండు రోజుల్లో రూ.282 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే ఇంచుమించు 4 రెట్లు ఎక్కువగా అమ్మకాలు జరిపారు. ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకే మద్యం అమ్మకాలు జరుపుతుండగా మద్యం ప్రియులు మాత్రం వ్యాక్సిన్‌లు, కోవిడ్ పరీక్షల కంటే మద్యం కొనుగోలుకే ఎక్కువ మక్కువ చూపుతున్నారన్నది ఈ రెండు రోజుల మద్యం అమ్మకాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

లాక్‌డౌన్ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుండే మద్యం కొనుగోళ్ల కోసం బారులు తీరుతున్నారు. ఒక్కో క్వార్టర్‌కు బెల్టు దుకాణాలకు ఎమ్మార్పీ కంటే అదనంగా రూ.20కి విక్రయిస్తుండటంతో మద్యం సిండికేట్‌కు కాసుల వర్షం కురుస్తోంది ఆంధ్రలో బెల్టు దుకాణాలపై సీఎం జగన్ కొరడా ఝళిపించారు. కానీ లాక్‌డౌన్ సాకుతో బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయించినా.. పగలు, రాత్రి తేడా లేకుండా బెల్టు దుకాణాలను అధికారులు తెరిపిస్తున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా గల్లీ గల్లీలో మద్యం ఏరులై పారుతుంది. లాక్ డౌన్ లేని సమయంలో ఓ కూలి వ్యక్తి పొద్దంత పని చేసుకొని ఇంటికి వెళ్లే సమయంలో ఓ క్వార్టర్ సీసా తీసుకుని ఇంటికి వెళ్లి తాగి పడుకునేవాడు. అప్పుడు ఆ క్వార్టర్ సీసాకే పరిమితం అయ్యే వారు.

ఇప్పుడు లాక్ డౌన్ అమలులో ఉండడంతో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉండడంతో ఉదయం ఓ క్వార్టర్ కొనుగోలు చేసి.. సాయంత్రం కాగానే తిరిగి బెల్టు దుకాణాల వైపు పరుగులు పెడుతున్నారు. ఇక్కడ బెల్టు దుకాణాల్లో ఒక్కొక్క క్వార్టర్‌పై బ్రాండ్‌ను బట్టి 30 నుండి 50 రూపాయలు అదనంగా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఈ సిండికేట్ మాఫియా అంతా అబ్కారీ శాఖ అధికారుల కనుసైగల్లోనే జరుగుతుందని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ప్రభుత్వం నడవాలంటే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం మద్యం కాబట్టే ఆబ్కారీ శాఖ అధికారులు బెల్టు దుకాణాల్లో మద్యం విక్రయించినా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement