న్యూఢిల్లి ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – భారత రాజ్యాంగంలో సోషలిస్ట్ అనే పదాన్ని పొందుపర్చుకున్నా మంటే ఈ దేశంలో సంపద ఎవరో కొన్ని కుటుంబాలు లేదా కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితం కాకుండా దేశం మొత్తం సమానంగా పంచుకుని జీవించాలని రాజ్యాంగ నిర్దేశకులు భావించారు. ప్రజల కష్టాన్ని, దేశ సంపదను కొన్ని కుటుంబాలు లేదా వ్యక్తులు దోచుకుని బలవంతంగా ఆస్తులు పోగేసుకునే విధానం భారత్‌లో ఉండకూడదని ఆశించారు. అయితే సోషలిస్ట్ అనే పదం భారత రాజ్యాంగానికే పరిమిత మైంది. ఆచరణలో ఇందుకు విరుద్ధమైన వైఖరి దేశంలో అమల్లో కొచ్చింది. ప్రజల శ్రమతో ప్రభుత్వం సృష్టించే సంపద దేశంలోని కొన్ని కుటుంబాలకే పరిమితమైంది. మొత్తం సంపదలో 95శాతం జనాభాలో ఒక శాతం కుటుంబాల వద్దకు చేరడంతో గత దశాబ్దకాలంలో పారి శ్రామిక, వాణిజ్య వేత్తలు, సంపన్నులపై ప్రజల్లో విపరీతమైన ద్వేషం పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన అదానీలపై కూడా భారతీయుల్లో ఒక విధమైన వ్యతిరేకత నెలకొంది. వాస్తవానికి బ్రిటీష్ పాలనా కాలం నుంచి దేశంలో టాటాలు, బిర్లాలు పారిశ్రామిక సామ్రాజ్యాల్ని స్ధాపించారు. దేశ అవసరాలకు అనుగుణం గా పరిశ్రమల్ని నెలకొల్పారు. దేశీయంగా తక్కువ ధరకే వస్తువులు లభించేలా వ్యాపారాలు చేశారు. మౌలిక వసతుల రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు పెట్టుబడులు పెట్టారు. న్యాయంగా, చట్టబద్దంగా వ్యాపారాలు నిర్వహించారు. తమ ఫౌండేషన్ల పేరిట వందలు, వేల కోట్ల నిధులతో ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలందిస్తున్నారు. మరోవైపు ఆధ్యాత్మిక రంగంలోనూ విస్తృతంగా నిధులు వెచ్చిస్తున్నారు. ఈ కారణంగానే దశాబ్దాలు గడిచినా భారత్‌లో టాటాలు, బిర్లాల పట్ల ప్రజలకేమాత్రం వ్యతిరేకత కలగలేదు. పైగా ఆ కుటుంబాల్ని ఈ దేశ సంపదగా భారతీయులు పరిగణిస్తారు.
కానీ దేశంలో మోడీ నాయకత్వంలో ఎన్‌డీఏ సర్కార్ ఏర్పాటైన అనంతరం వేగంగా విస్తరించిన అదానీల సామ్రాజ్యం పట్ల దేశంలో అడుగడుగునా వ్యతిరేకత స్పష్టమౌతోంది. ఇందుక్కారణం టాటాలు, బిర్లాలు ప్రజల అవసరాలకనుగుణంగా కొత్త పరిశ్రమల్ని ఏర్పాటు చేశారు. కానీ అదానీలు మాత్రం అంతకుముందే వ్యాపార సామ్రాజ్యాల విస్తరణ ప్రారంభించిన అంబానీలు ప్రభుత్వం, ప్రజలు ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకున్న నిధులతో నిర్మించిన భారీ మౌలిక సదుపాయాల్ని చట్టాల్లోని చిన్న చిన్న లోపాల ఆధారంగా తమ హస్తగతం చేసుకున్నారు. అలాగే కేంద్రం కూడా దేశంలోని ప్రధాన ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, గనులు, 5జీ సెక్టార్ వంటి దేశ విలువైన సంపదపై అదానీ, అంబానీలకు పెత్తనం కట్టబెట్టడం కూడా వీరిపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి దోహదపడింది. ఎందరో త్యాగధనుల ఆత్మబలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కును కోట్లాదిమంది ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రం, ఆ ప్రతిష్టాత్మక సంస్థను కూడా అదానీలకే అప్పగించే ప్రయత్నం ఆ కుటుంబం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరగడానికి కారణమౌతోంది.
ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక సామ్రాజ్యాలున్నాయి. అయితే ఆయా పారిశ్రామిక సంస్థలు విదేశీ బ్యాంకుల నుంచి పెద్దెత్తున నిధులు సమీకరిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాల్ని నిర్వహిస్తాయి. సంపాదించిన సొమ్ము దేశీయంగా పెట్టుబడులు పెడతాయి. ఆ సామ్రాజ్యాల అధినేతలు కూడా దేశీయంగా ఆస్తులు సమకూర్చుకుంటారు. కానీ అదానీ ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఈ దేశంలోని నిర్మాణ, మౌలిక రంగాల, గనులపై తిరుగులేని అజమాయిషీ సాధించిన అదానీ కుటుంబం దేశీయంగా సంపాదించిన సొమ్మును విదేశాల్లో మదుపు పెడుతోంది. తమ భావి అవసరాలకనుగుణంగా వేల కోట్ల వ్యయంతో అమెరికా, సింగపూర్, స్విట్జర్లాండ్‌ల్లో రాజభవనాల్ని నిర్మించుకుంది. అక్కడే స్థిరనివాసానికి ఏర్పాట్లు చేసుకుంది. కేవలం 8ఏళ్ళలో అదానీ వ్యాపార సామ్రాజ్యం ప్రపంచంలోనే ఎవరూ ఊహించని స్థాయిలో వేగంగా వివిధ రంగాల్లోకి పాకింది. 8ఏళ్ళలో అదానీ ఆదాయం కొన్ని వందల రెట్లు పెరిగింది. నిమిష నిమిషానికి వందల కోట్లు ఆయన సంపదకు అదనంగా కలిశాయి.
2018లో నిబంధనలకు విరుద్ధంగా ఒకేసారి ఆరు ఎయిర్‌పోర్టుల నిర్వహణా బాధ్యతను కేంద్రం అదానీ గ్రూప్‌కు కట్టుబెట్టింది. ఈ ఎయిర్‌పోర్టులన్నింటిని ప్రభుత్వమే తన సొంత నిధులతో నిర్మించింది. నిర్వహణ కోసం ఈ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఇలా కేంద్రం నుంచి అనూహ్య రీతిలో ప్రయోజనాలు పొందినప్పటికీ అదానీలేనాడూ ఈ దేశ ప్రయోనాల కోసం ప్రాకులాడలేదు. టాటాలు, బిర్లాల తరహాలో సరికొత్త ఆవిష్కరణలకు ప్రయత్నించలేదు. ప్రజల అవసరాలకనుగుణగా పరిశ్రమల్ని నెలకొల్పలేదు. ఈ కారణంగానే అదానీ వ్యాపార సామ్రాజ్యంపై వెల్లువెత్తిన ఆరోపణలు భారతీయులకు బాధ కలిగించక పోగా వారిపై మరిన్ని విమర్శలకు ఈ దేశ ప్రజల్ని పురిగొల్పాయి. ఓ వైపు కేంద్రం కార్పొరేట్లకు సామాజిక బాధ్యతను నిర్దేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం కూడా చేసిది. అయితే చట్టానికనుగుణంగా తమ లాభాల్లో కొంత భాగాన్ని తమ పరోక్ష ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని వ్యయం చేయడం తప్ప ఈ దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెంచే క్రమంలో అదానీల కుటుంబం చిన్నపాటి పాత్రను కూడా పోషించక పోవడం వారి పట్ల దేశీయంగా ఇంతటి వ్యతిరేకత వ్యక్తం కావడానికి దారితీసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.